మెదక్​ జిల్లాలో పెరిగిన దొంగతనాలు

మెదక్​ జిల్లాలో పెరిగిన దొంగతనాలు
  • ఇంటికి తాళం వేస్తే అంతే సంగతి!
  • ఆలయాలనూ వదలని దొంగలు 
  • పోలీసులకు సవాల్​గా మారుతున్న కేసులు 
  • నిఘా పెంచాలని కోరుతున్న ప్రజలు 

మెదక్​ జిల్లాలో ఇటీవల వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాళం వేసిన ఇండ్లే టార్గెట్​గా దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయాలనూ వదలడం లేదు. ఈ నెలలోనే పదికి పైగా మేజర్ చోరీలు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దొంగతనాలు ఆగకపోవడం పోలీసులకు సవాల్​గా మారుతోంది. నిఘా మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

మెదక్, వెలుగు: మెదక్​ జిల్లాలో ఇటీవల దొంగతనాలు పెరిగాయి. ఈ నెల 17న నేషనల్ హైవే 44 మీద తూప్రాన్​ బైపాస్​ రోడ్డులో ముగ్గురు దొంగలు లారీ డ్రైవర్ల ​మీద కత్తులతో దాడి చేసి పరారైన ఘటన జిల్లాలో కలకలం రేపింది. 21న రాత్రి మాసాయిపేట మండలం బంగారమ్మ గుడి వద్ద రూ.7లక్షల విలువైన ఐరెన్​ స్క్రాప్​​తో వెళ్తున్న డీసీఎం వ్యాన్​నే దొంగలు ఎత్తుకెళ్లిపోయారంటే వారు ఎంతగా రెచ్చిపోతున్నారో అర్థమవుతోంది. 

తాళం వేసిన ఇండ్లే టార్గెట్!

తాళం వేసిన ఇండ్లను టార్గెట్​గా చేసుకొని ఉన్నకాడికి దోచేస్తున్నారు. ఈనెల 9న మనోహరాబాద్​మండల కేంద్రంలో నాలుగు ఇండ్లలో, 21న నర్సాపూర్​ మండలం లింగాపూర్​లో, అదే రోజు మాసాయిపేట మండలం బొమ్మారం గ్రామంలో, చిలప్​ చెడ్ మండల కేంద్రంలో, 25న చిలప్​చెడ్​ మండలం గౌతాపూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటి యజమానులు బంధువుల ఇండ్లకు, పొలం వద్ద పనులకు పోయివచ్చేలోపు ఇండ్లలోని నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. 

ఆలయాల్లోని అభరణాలూ మాయం.. 

ఆలయాల్లోని అభరణాలు, హుండీలు, విలువైన వస్తువులనూ దొంగలు వదలడం లేదు. ఈనెల 22న వెల్దుర్తి గాంధీ చౌక్​ చౌరస్తాలోని హనుమాన్​ ఆలయంలో, శివ్వంపేట మండల పరిధిలోని పెద్ద చెరువు కట్టపై కొత్తగా నిర్మించిన కట్ట మైసమ్మ గుడిలో, 23న తూప్రాన్​ పట్టణ పరిధిలోని పెద్ద చెరువు కట్ట వద్ద ఉన్న ఆలయంలో విగ్రహాలపై ఉన్న నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. హుండీలను పగులగొట్టి నగదు తీసుకెళ్లారు. 

నిఘా పెంచాలి.. 

ఇటీవల పెరుగుతున్న వరుస దొంగతనాల నేపథ్యంలో వాటి కట్టడికి పోలీసులు మరింత నిఘా పెంచాలని  స్థానికులు కోరుతున్నారు. ఎక్కడైనా దొంగతనం జరిగినప్పుడు మాత్రమే ఆ ప్రాంతంలో పోలీసులు కొన్నాళ్లు పెట్రోలింగ్​ చేసి ఆ తర్వాత పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో రాత్రి వేళలో రెగ్యులర్​గా పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు. ప్రధాన కూడళ్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే దొంగతనాలు తగ్గే అవకాశం ఉందని, ఒకవేళ జరిగినా కేసులను ఛేదించేందుకు ఎంతో ఉపయోగపడుతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

చర్యలు చేపడుతున్నాం.. 

వరుస దొంగతనాల కట్టిడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే నిజాంపేట్​మండల పరిధిలో ప్రజల సహకారంతో  గ్రామాలు, ప్రధాన కూడళ్లలో మొత్తం 50 కెమెరాలు ఏర్పాటు చేశాం. దీంతో దొంగతనాలు తగ్గుతుండటంతోపాటు, తక్కువ సమయంలోనే కేసులు ఛేదించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ తరహాలో అన్ని మండలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు దొంగతనాలు తగ్గుతాయి. 

-  శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై, నిజాంపేట