- మరో వారం రోజుల వరకూ ఇదే పరిస్థితి
- నిజామాబాద్, ఆదిలాబాద్ లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు
- బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న జనం
దేశవ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగింది. చలితో జనం వణికిపోతున్నారు. ఉదయం సమయంలో బయటికి వెళ్లటం ఇబ్బందిగా మారింది. ఉష్ణోగ్రతలు పడిపోవటంతో ఇబ్బంది పడుతున్నారు. సౌత్, నార్త్ తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో లోయర్ టెంపరేచర్స్ నమోదవుతుండటంతో జనం అల్లాడి పోతున్నారు. ఇటు వారం రోజుల నుంచి ఉదయం 8 గంటల పొద్దెక్కినా రాష్ట్రంలో సూర్యుడు బయటకు రావడం లేదు. హైదరాబాద్ లోనూ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితే ఉండొచ్చంటోంది వాతావరణ శాఖ.
రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ఆదిలాబాద్ ఏజెన్సీలో కనిష్టంగా 5 డిగ్రీలుగా నమోదు అవుతోంది. ఇది మరింత తగ్గే ఛాన్సుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. మెదక్, రామగుండం, నిజామాబాద్, ఆదిలాబాద్ లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి.
ఇటు హైదరాబాద్ లోనూ చలి బాగా పెరిగింది. సాయంత్రం 8 గంటల తర్వాత సిటీ రోడ్ల మీద జన సంచారం బాగా తగ్గిపోతోంది. మార్నింగ్ వాకర్స్ కూడా చలికి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఉత్తర భారతం నుంచి రాష్ట్రానికి శీతల గాలులు వీస్తుండటంతో చలి పెరిగిందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.

