దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. ఒక్కరోజే 28 వేల కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. ఒక్కరోజే 28 వేల కేసులు
  • వారం నుంచి రోజూ 20 వేలకు పైనే కేసులు
  • 24 గంటల్లో 188 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వారం రోజులుగా వైరస్​ వ్యాప్తి మరింత ఎక్కువైంది. కేసులు మళ్లీ పెరుగుతున్న రాష్ట్రాల సంఖ్య మొన్నటి వరకు ఐదు మాత్రమే.. ఇప్పుడు ఆ సంఖ్య 12 కు చేరింది. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 28,903 కేసులు నమోదయ్యాయి. 5 నెలల తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు రికార్డయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1.14 కోట్లు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మరో 188 మంది కరోనాతో చనిపోగా ఇందులో మహారాష్ట్రలో 84, పంజాబ్‌‌‌‌లో 38, కేరళలో 15, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో 12 మంది ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం మరణాలు 1,59,044 లకు చేరాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 2,34,406 యాక్టివ్‌‌‌‌ కేసులున్నాయి. వైరస్‌‌‌‌ నుంచి కోలుకుని 1,10,45,284 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.65% ఉండగా మరణాల రేటు 1.39 శాతంగా ఉంది.
 

మహారాష్ట్రలో 24 గంటల్లో 23 వేల కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో ఎక్కువ శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఒక్కరోజులో నమోదైన 28,903 కేసుల్లో 23,179 ఇక్కడివే. ఆ తర్వాత కేరళలో 1,970, పంజాబ్‌‌‌‌లో 1,643 కేసులు నమోదయ్యాయి. మార్చి 1 నాటికి మహారాష్ట్రలో పాజిటివ్‌‌‌‌ రేటు 11% ఉంటే ప్రస్తుతం 16 శాతానికి పెరిగింది. ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని, టెస్టులు పెరగట్లేదని, మరింత ఎక్కువగా టెస్టులు చేయాలని చెప్పినట్టు కేంద్రం తెలిపింది.