న్యూఢిల్లీ: ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఫారెక్స్ స్వాప్ చర్యల వల్ల దేశంలోకి 60 నుంచి 70 బిలియన్ల డాలర్లు ( సుమారు 5.5 లక్షల కోట్ల నుంచి 6.5 లక్షల కోట్ల) విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) తెలిపింది. ఆథరైజ్డ్ డీలర్ బ్యాంకులు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు 3–5 సంవత్సరాల కాలపరిమితి గల ఫారిన్ కరెన్సీ నాన్–-రెసిడెంట్ బ్యాంక్ డిపాజిట్ల కోసం ఆర్బీఐ స్వాప్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ఈసీబీలు) సేకరించేలా ప్రోత్సహించడానికి సబ్సిడీ ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని కూడా ఆర్బీఐ ప్రకటించింది. ఈ చర్యలు రూపాయి విలువను బలోపేతం చేయడానికి, ఆర్థిక వ్యవస్థలో నిధుల కొరతను తీర్చడానికి ఉపయోగపడతాయి.
- విదేశాలకు మన ఎఫ్‌డీఐలు 49 శాతం డౌన్
భారతీయ కంపెనీలు విదేశాల్లో పెట్టే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఔట్‌వర్డ్ ఎఫ్‌డీఐల) పరిమాణం ఈ ఏడాది మే నెలలో భారీగా తగ్గింది. ఆర్‌బీఐ డేటా ప్రకారం.. ఏప్రిల్‌లోని 8.84 బిలియన్ డాలర్లతో పోలిస్తే, మే నెలలో 49 శాతం పడిపోయి 4.49 బిలియన్ డాలర్లకు చేరింది. భారతీయ కంపెనీలు విదేశాల్లో ఈక్విటీ పెట్టుబడులు, రుణాలు, గ్యారెంటీలను తగ్గించుకోవడమే దీనికి ప్రధాన కారణం. అయితే, కిందటేడాది మేతో (3.34 బిలియన్ డాలర్లతో) పోలిస్తే, 34.6 శాతం పెరిగింది.
