IND vs AFG: అప్ఘ‌నిస్థాన్‌తో టీ20 సిరీస్‌.. కొత్త కెప్టెన్ పరిచయం కానున్నాడు

IND vs AFG: అప్ఘ‌నిస్థాన్‌తో టీ20 సిరీస్‌..  కొత్త కెప్టెన్ పరిచయం కానున్నాడు

దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం భారత జట్టు స్వదేశంలో అఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుండగా, ఇరు జట్ల మధ్య మూడు టీ20లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్ ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. కొత్త కెప్టెన్ పరిచయం కానున్నాడని రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. 

రోహిత్ శర్మ స్థానంలో పగ్గాలు అందుకున్న హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమై చాలా రోజులు అవుతోంది. అతని స్థానంలో బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. దీంతో అప్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌‌కు కొత్త కెప్టెన్ పరిచయం కాబోతున్నాడని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టు పగ్గాలు అప్పగించనున్నారని సమాచారం. అయితే, అందుకు జడేజా ఒప్పుకోకపోవచ్చనేది మరో అంశం. ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ చేపట్టిన జడ్డు టోర్నీ మధ్యలోనే ఆ భాద్యతల నుంచి తప్పుకున్నాడు. జట్టును నడిపించటం తన వల్ల కాదని వైదొలిగాడు. ఈ కారణంగానే కెప్టెన్సీకి అతడు దూరంగా ఉండొచ్చని సమాచారం.

రోహిత్, అయ్యర్..! 

ఒకవేళ జడేజా అంగీకరించకపోతే అందుకు ఉన్న ఇతర ప్రత్యామ్నాయాల‌పై టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. శ్రేయ‌స్ అయ్యర్ పేరు ప‌రిశీల‌నలో ఉన్నట్లు  స‌మాచారం. అయితే, ఈ బ్యాటర్ ఎప్పుడు జట్టులో ఉంటాడో.. ఎప్పుడు ఉండడో తెలియని పరిస్థితి. ఒక సిరీస్ నుంచి మరో సిరీస్‌కు 6 నెలల సమయం తీసుకునే అయ్యర్ గాయపడకకుండా ఉంటాడా! అనేది బీసీసీఐ పెద్దల ముందున్న సమస్య. ఒకవేళ అయ్యరూ కాదంటే మళ్లీ రోహిత్‌కే పగ్గాలు అప్పగించనుందని సమాచారం. ఈ ముగ్గరిలో ఎవ‌రు కెప్టెన్ అన్నది జ‌న‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో తేల‌నుంది.

ఇండియా vs అఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్

  • తొలి టీ20(జనవరి 11): ఐఎస్ బింద్రా స్టేడియం, మొహాలి
  • రెండో టీ20(జనవరి 14): హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్
  • మూడో టీ20(జనవరి 17):  చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు

టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కానున్నాయి.