IND vs AUS 2nd T20I: తడిసి ముద్దయిన గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం.. రెండో టీ20 అనుమానమే!

IND vs AUS 2nd T20I: తడిసి ముద్దయిన గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం.. రెండో టీ20 అనుమానమే!

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20కి వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఆదివారం(నవంబరు 26) తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సివుండగా, శనివారం ఉదయం కురిసిన వర్షంతో మైదానం జలమయం అయింది. పిచ్‌పై కవర్లు కప్పి ఉంచినప్పటికీ వర్షపు నీరు భారీగా నిలిచింది. రాబోయే 48 గంటలు ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొంది.     

ప్రస్తుతం ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే మ్యాచ్ జరగాల్సిన సాయంత్రం సమయంలో వర్షం పడే అవకాశం తక్కువని ఆక్యూ వెదర్ అంచనా వేసింది. మధ్యాహ్నం జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ.. సాయంత్రం సమయంలో ఆకాశం చాలా స్పష్టంగా ఉంటుందని తన నివేదికలో వెల్లడించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌‌కు వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగినా.. గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం సిబ్బంది ఎంత త్వరగా మైదానాన్ని సిద్ధం చేయగలరు అనే దానిపై మ్యాచ్ ఆధారపడి ఉంటుంది.

విశాఖ సాగరతీరాన

కాగా, విశాఖ సాగరతీరాన జరిగిన తొలి టీ20లో భారత యువ జట్టు ఆసీస్‌ను మట్టి కురిపించిన విషయం తెలిసిందే. కంగారూలు నిర్ధేశించిన 2028 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు చేధించారు. ఇప్పుడు రెండో టీ20లో కూడా నెగ్గి.. ఐదు మ్యాచ్‌‌ల 20 సిరీస్ లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు.

తుది జట్లు(అంచనా)

భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంగా.