IND vs ENG: జడేజా పాంచ్ పటాకా.. మూడో టెస్టులో టీమిండియా భారీ విజయం

IND vs ENG: జడేజా పాంచ్ పటాకా.. మూడో టెస్టులో టీమిండియా భారీ విజయం

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన రాజ్‌కోట్ టెస్టు 4 రోజులకే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో గట్టిపోటీనిచ్చిన ఇంగ్లీష్ బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చేసరికి తడబడ్డారు. 557 పరుగుల భారీ ఛేదనలో 122 పరుగులకే కుప్పకూలారు. దీంతో రోహిత్ సేన 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

జడేజా మాయ

557 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ ఆదిలోనే తడబడింది. 28 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 11 పరుగుల వద్ద క్రాలీని బుమ్రా పెవియన్ చేర్చగా.. బెన్ డకెట్(4) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆపై కొద్దిసేపటికే ఓలీ పొప్(3).. జడేజా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. ఆ తదుపరి ఓవర్‌లోనే బెయిర్ స్టో(4) ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 28 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు.. జడేజా ధాటికి విలవిలలాడిపోయారు. అతన్ని ఎదుర్కోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. 

అనంతరం జో రూట్(7), బెన్ స్టోక్స్(15) జోడి ఆదుకునే ప్రయత్నం చేసినా.. జడేజా, కుల్దీప్ వారి ఎత్తుగడలను ముందుకు సాగనివ్వలేదు. రూట్‌ను జడేజా వెనక్కి పంపగా.. స్టోక్స్‌ను కుల్దీప్ తెలివిగా బోల్తా కొట్టించాడు. ఆ సమయంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు బెన్ ఫోక్స్(16), టామ్ హార్ట్లీ(16) కాసేపు ఆదుకున్నారు. పరుగులు చేయకుండా.. వికెట్ ఇవ్వకుండా భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. చివరలో మార్క్ వుడ్ (33; 15 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో 5 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ 2 వికెట్లు తీసుకున్నారు.