IND vs ENG 4th Test: రెండు మార్పులు.. నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఇదే

IND vs ENG 4th Test: రెండు మార్పులు..  నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఇదే

మూడో టెస్టులో ఘోర పరాజయం ఎదురవడంతో ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. సిరీస్ నిలుపుకోవాలంటే నాలుగో టెస్టులో తప్పక గెలవాల్సి ఉండడంతో జట్టులో కీలక మార్పులు చేసింది. ఆడిన రెండు టెస్టుల్లోనూ విఫలమైన పేసర్ మార్క్ వుడ్‍ను తప్పించి అతని స్థానంలో ఓలీ రాబిన్సన్‍ను తీసుకుంది. అలాగే, స్పిన్నర్ రెహాన్ అహ్మద్‍ను పక్కన పెట్టి షోయబ్ బషీర్‌కు తుది జట్టులో చోటు కల్పిచింది.

నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్, ఓలీ రాబిన్సన్.

బుమ్రా స్థానంలో ఆకాష్ దీప్

మరోవైపు, భారత జట్టు కూడా ఒకటి లేదా రెండు మార్పులతో నాలుగో టెస్టులో బరిలోకి దిగనుంది. వర్క్ లోడ్ కారణంగా మేనేజ్మెంట్.. స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. అతని స్థానంలో భారత యువ పేసర్ ఆకాశ్ దీప్ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, రాంచీ పిచ్ స్పిన్‍కు అనుకూలించే అవకాశం ఉండటంతో అదనపు స్పిన్నర్ కావాలంటే ఆకాశ్ దీప్‍ను పక్కనపెట్టి అక్షర్ పటేల్‍ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఇక కేఎల్ రాహుల్ సస్పెన్స్ అలానే కొనసాగుతోంది. అతను ఆడేది లేనిదీ టాస్ పడ్డాకనే తెలియనుంది. ఒకవేళ అతన్ని పక్కనపెడితే.. రజత్ పాటిదార్‌ కొనసాగించే అవకాశం ఉంది.

నాలుగో టెస్టుకు భారత జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్. 

ప్రస్తుతం టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‍లో 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్ట్ గెలిస్తే.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవచ్చు.