అద్భుతం చేస్తారా!.. 4 వికెట్లు తీస్తే ఇండియాదే గెలుపు

అద్భుతం చేస్తారా!.. 4 వికెట్లు తీస్తే ఇండియాదే గెలుపు
  • 374 టార్గెట్ ఛేజింగ్‌‌లో ఇంగ్లండ్ 339/6 
  • మరో 35 రన్స్ దూరంలో ఆతిథ్య జట్టు
  • 4 వికెట్లు తీస్తే ఇండియాదే గెలుపు
  • బ్రూక్, రూట్ సెంచరీలు
  • రాణించిన ప్రసిధ్‌‌, సిరాజ్‌‌

లండన్‌‌:  ఇండియా–ఇంగ్లండ్ ఐదో టెస్టు  అనూహ్య మలుపులు తిరుగుతూ ఆఖరి రోజుకు చేరుకుంది. చేజారిందనుకున్న మ్యాచ్‌‌లో ఆశలు సజీవంగా నిలిపిన ఇండియా పేసర్లు జట్టుకు విజయం అందించి అద్భుతం చేసేందుకు నాలుగు వికెట్ల దూరంలో నిలిచారు. 374 రన్స్ భారీ టార్గెట్ ఛేజింగ్‌‌లో హ్యారీ బ్రూక్ (98 బాల్స్‌‌లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 111), జో రూట్‌‌ (152 బాల్స్‌‌లో 12 ఫోర్లతో 105) సెంచరీలతో దంచడంతో ఓ దశలో 301/3తో నిలిచిన ఇంగ్లండ్‌‌ గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ,  ఈ టైమ్‌లో  ఇండియా బౌలర్లు మ్యాజిక్ చేశారు. వెంటవెంటనే మూడు వికెట్లు పడగొట్టి మన టీమ్‌ను మళ్లీ రేసులోకి తెచ్చారు. దాంతో నాలుగో రోజు, ఆదివారం వర్షంతో ఆట ముగిసిన సమయానికి ఇంగ్లండ్‌‌ 76.2  ఓవర్లలో 339/6తో నిలిచింది. ప్రసిధ్ కృష్ణ (3/109), మహ్మద్ సిరాజ్ (2/95) అదరగొట్టారు. ప్రస్తుతం జెమీ స్మిత్ (2 బ్యాటింగ్‌‌), ఒవర్టన్ (0 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉండగా ఇంగ్లండ్‌‌కు మరో 35 రన్స్ అవసరం కాగా.. ఇండియాకు 4 వికెట్లు కావాలి. భుజం గాయానికి గురైన క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌‌కు రాకపోతే మూడు వికెట్లు తీస్తే ఇండియా మ్యాచ్ నెగ్గి సిరీస్‌‌ను డ్రా చేసుకుంటుంది. సోమవారం ఉదయం 3.4 ఓవర్ల తర్వాత కొత్త బాల్‌‌ అందుబాటులోకి రానుండటం ప్లస్ పాయింట్ కానుంది. 

ఆరంభం మనదే

రికార్డు టార్గెట్ ఛేజింగ్ కోసం ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 50/1తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌ను తొలి సెషన్‌‌లో  మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఇబ్బంది పెట్టాడు. చెరో వికెట్‌‌ రాబట్టి టీమిండియా విజయంపై ఆశలు రేపారు. ముఖ్యంగా తన ఎనిమిది ఓవర్ల స్పెల్‌‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సిరాజ్‌‌   ఓవర్‌‌‌‌నైట్ బ్యాటర్లు బెన్ డకెట్ (54), ఒలీ పోప్‌‌ (27)ను ఇబ్బంది పెట్టాడు. మరో ఎండ్‌‌లో బౌలింగ్‌‌ చేసిన ప్రసిధ్ కృష్ణ తన నాలుగో బాల్‌‌కే డకెట్‌‌ వికెట్ తీశాడు.  ప్రసిధ్‌‌ బాల్‌‌ను డ్రైవ్ చేసే ప్రయత్నంలో డకెట్‌‌ సెకండ్ స్లిప్‌‌లో క్యాచ్ ఇవ్వడంతో ఇండియాకు బ్రేక్ లభించింది. ఇక, సిరాజ్  నిరంతర ఎదురుదాడికి ఫలితం లభించింది. ప్రసిద్ధ్ బౌలింగ్‌‌లో మూడు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన పోప్‌‌ను అతను  ఓ పదునైన బాల్‌‌తో మరోసారి ఎల్బీ చేశాడు. ఈ దశలో జో రూట్‌‌, హ్యారీ బ్రూక్‌‌ బాధ్యత తీసుకున్నాడు. క్రీజులో పటిష్టంగా కనిపించిన రూట్‌‌..  సిరాజ్ బౌలింగ్‌‌లో రెండు అద్భుతమైన కవర్ డ్రైవ్‌‌లు ఆడాడు. ఇంకోవైపు  బ్రూక్ తన మార్కు దూకుడు చూపెట్టాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌‌ లో క్రీజు ముందుకొచ్చి కవర్స్ మీదుగా సిక్స్ కొట్టాడు.  ఆ వెంటనే అతనిచ్చిన క్యాచ్‌‌ను అందుకున్న సిరాజ్ బౌండరీ లైన్‌‌పైన కాలు పెట్టడంతో బతికిపోయిన బ్రూక్ ఈ చాన్స్‌‌ను సద్వినియోగం చేసుకున్నాడు. రూట్‌‌తో కలిసి 164/3తో జట్టును లంచ్‌‌కు తీసుకెళ్లాడు.

బ్రూక్‌‌, రూట్ దంచినా..

లంచ్ బ్రేక్ తర్వాత బ్రూక్‌‌ మరింత ధాటిగా ఆడాడు. రూట్‌‌ కూడా తన మార్కు చూపెట్టాడు. సాఫ్ట్ బాల్‌‌తో పిచ్ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో టీమిండియా ముగ్గురు పేసర్లు వీళ్లను అడ్డుకోలేకపోయారు. స్పిన్నర్లు  సుందర్, జడేజా కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు.  బ్రూక్ పూర్తిగా కౌంటర్‌‌‌‌ ఎటాక్‌‌తో భారీ షాట్లు కొడితే రూట్ తనదైన స్టయిల్లో ఎలాంటి శ్రమ లేకుండా రన్స్ రాబట్టాడు. తీవ్ర ఒత్తిడిలో కూడా అద్భుతమైన షాట్స్‌‌ ఆడే తన సత్తాను చూపెట్టిన బ్రూక్ 39 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ 98 బాల్స్‌‌లోనే సెంచరీ అందుకున్నాడు. వీళ్లను అడ్డుకునేందుకు షార్ట్ బాల్ వ్యూహాన్ని కూడా ఇండియా బౌలర్లు ప్రయోగించారు. కానీ పాత బాల్‌‌తో  కూడా బ్రూక్, రూట్ వాటిని సులభంగా ఎదుర్కోవడంతో ఇండియా ప్లేయర్లు పూర్తిగా డీలా పడ్డారు. ఆకాశ్‌‌ దీప్ బౌలింగ్‌‌లో బ్రూక్ కవర్ మీదుగా బౌండరీ కొట్టినప్పుడు ఇది మరింత స్పష్టమైంది . అయితే, రెండు బాల్స్‌‌ తర్వాత బ్రూక్ మరో షాట్‌‌కు ట్రై చేసి మిడాఫ్‌‌లో సిరాజ్‌‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  దాంతో నాలుగో వికెట్‌కు  211 బాల్స్‌‌లోనే 195 భారీ భాగస్వామ్యం  ముగింసింది. అయినా తగ్గని రూట్.. టీ బ్రేక్‌‌కు ముందు సిరాజ్ బౌలింగ్‌‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 98 రన్స్ పైచి వచ్చాడు.  రెండో సెషన్‌‌ను  317/4తో ముగించిన ఇంగ్లండ్‌‌కు చివరి సెషన్‌‌లో 57 రన్స్ అవసరం అయ్యాయి.

ప్రసిధ్‌ డబుల్ స్ట్రోక్‌

టీ బ్రేక్‌‌ నుంచి వచ్చిన వెంటనే రూట్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ప్రసిధ్ 9 బాల్స్‌ తేడాతో రెండు వికెట్లు తీసి హోమ్‌ టీమ్‌కు షాకిచ్చాడు. తొలుత బెథెల్‌‌ (5)ను బౌల్డ్ చేయడంతో టీమిండియాలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇక  ఇంగ్లిష్ టీమ్ విజయానికి ఇంకో 37 రన్స్ అవసరమైన దశలో  కీపర్‌‌‌‌ క్యాచ్‌‌తో రూట్‌‌ను పెవిలియన్ చేర్చడంతో గిల్‌‌సేన ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. కొత్తగా క్రీజులోకి వచ్చిన స్మిత్‌‌, ఒవర్టన్ ఇబ్బంది పడగా.. వెలుతురు తగ్గి వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మొత్తంగా టీ బ్రేక్‌‌ టైమ్‌‌లో చినుకులు పడి వికెట్‌‌ నుంచి కాస్త సపోర్ట్ లభించడంతో ఇండియా పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.  మూడో సెషన్‌‌లో 10.2 ఓవర్లలో  ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వకుండా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 224 ఆలౌట్‌‌. ఇంగ్లండ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌: 247 ఆలౌట్‌‌. ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌: 396 ఆలౌట్‌‌ ; ఇంగ్లండ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌ (టార్గెట్‌‌374 ):  76.3 ఓవర్లలో  339/6 (హ్యారీ బ్రూక్ 111, జో రూట్ 105, ప్రసిధ్ కృష్ణ 3/109).

3   ఇండియాతో టెస్టు సిరీస్‌‌ల్లో మూడు సార్లు 500 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్ జో రూట్.

13  ఇండియాపై రూట్‌కు ఇది  13వ సెంచరీ. దాంతో ఒకే ప్రత్యర్థిపై  అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌‌గా సునీల్ గవాస్కర్ (వెస్టిండీస్‌పై 13) రికార్డును సమం చేశాడు. బ్రాడ్‌మన్ (ఇంగ్లండ్‌పై 19 సెంచరీలు)  ముందున్నాడు. 

6000  వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో 6 వేల రన్స్ పూర్తి చేసిన తొలి ఆటగాడు రూట్. స్మిత్ (4,278), లబుషేన్ (4,225) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

సిరాజ్ తప్పటడుగు

నాలుగో రోజు సిరాజ్  చేసిన ఫీల్డింగ్ తప్పిదం టీమిండియాను దెబ్బతీసింది. ఉదయం తక్కువ వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు డీలా పడగా.. డేంజర్ మ్యాన్‌‌ హ్యారీ బ్రూక్‌‌ను కూడా ఔట్ చేసి ఆ జట్టుపై మరింత పైచేయి సాధించే చాన్స్‌‌ సిరాజ్ కారణంగా చేజారింది. ప్రసిద్ధ్ వేసిన 35వ ఓవర్లో హ్యారీ బ్రూక్ పుల్‌‌ షాట్‌‌కు ప్రయత్నించగా.. ఎడ్జ్‌‌ తీసుకొని గాల్లోకి లేచిన బాల్‌‌ను సిరాజ్ ఫైన్ లెగ్ వద్ద క్యాచ్ పట్టినప్పటికీ, బౌండరీ లైన్‌‌పై అడుగు వేయడంతో అది సిక్స్‌‌గా మారింది. అప్పటికి 19 రన్స్ వద్ద ఉన్న బ్రూక్‌‌ ఈ  లైఫ్‌‌తో మరింత రెచ్చిపోయి ఆడి సెంచరీ కొట్టాడు.  చివరకు ఆకాశ్ దీప్‌‌ బౌలింగ్‌‌లో అతను సిరాజ్‌‌కే క్యాచ్‌‌ ఇచ్చి ఔటయ్యాడు. కానీ, ఈ మధ్యలో  కీలకమైన 92 రన్స్ రాబట్టాడు.