ODI World Cup 2023: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్.. హాస్పిటల్ బెడ్లనూ వదలని ఫ్యాన్స్

ODI World  Cup 2023: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్.. హాస్పిటల్ బెడ్లనూ వదలని ఫ్యాన్స్

క్రికెట్ ప్రపంచంలో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ మరే ఇతర మ్యాచ్‌కు ఉండదంటే అతిశయోక్తి కాదు. అందులోనూ గత పదేళ్లుగా ఈ ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగకపోగా.. కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాయాదుల సమరాన్ని ప్రత్యక్షంగా చూడటానికి అభిమానులు కొత్తదారులు వెతుకుతున్నారు.

వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా ఇండియా- పాక్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీని సామర్థ్యం లక్ష మంది కావడంతో.. మ్యాచును ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు పోటీపడుతున్నారు. అయితే దేశ నలుమూలల నుంచి వచ్చే అభిమానులు వసతి కోసం నానా పాట్లు పడుతున్నారు. డబ్బున్నోళ్లు ఖరీదైన హోటల్ రూమ్స్ బుక్ చేస్తుంటే.. దబ్బలేని వారు, మధ్య తరగతి అభిమానులు ఆస్పత్రుల బెడ్ల వైపు ద్రుష్టి పెడుతున్నారు. 

వీరి తెలివికి జోహార్లు.. 

అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో హోటల్ రూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కనిష్టంగా రూ.50 వేల మొదలు గరిష్ఠంగా రూ.లక్ష వరకూ పలుకుతున్నాయి. పోనీ అప్పో సొప్పో చేసి అంత పెడదామన్నా అవీ ఖాళీ లేవు. బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. దీంతో అభిమానులు కొత్త ప్లాన్ వేశారు. స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్ బెడ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. హెల్త్ చెకప్ పేరిట.. ఒక రోజు వసతి కోసం అక్కడి ఆస్పత్రులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే అలా తమకు ఎన్నో వినతులు వచ్చినట్లు స్టేడియం దగ్గర్లోని హాస్పిటల్ యాజమాన్యాలు చెప్తున్నాయి.

రూ.3వేల నుంచి రూ.25వేల వరకూ

హోటల్ రూములతో పోలిస్తే.. హాస్పిటల్ బెడ్స్ ధర చాలా తక్కువుగా ఉంటోంది. కనిష్ఠంగా రూ.3వేల నుంచి రూ.25వేల వరకూ ఉంటున్నాయి. అందునా ఆహారంతో పాటు పూర్తి మెడికల్ చెకప్ లాంటి వసతులు కూడా ఉన్నాయి. దీంతో హోటల్ గదుల్లో వేలకువేలు పోసి రూమ్ తీసుకోవడం కంటే ఇలా చేయడం బెటరని చాలా మంది భావిస్తున్నారు. పేషెంట్‌తో పాటు మరొకరు కూడా ఉండే అవకాశం ఉండటంతో ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. ఆసుపత్రి యాజమాన్యాలు సరే అనగానే బుక్ చేసేయమంటున్నారు.

ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి మ్యాచ్ 

అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్‌ మ్యాచ్‌లు పది వేదికల్లో జరగనుండగా.. మొదటి సెమీ ఫైనల్‌కు ముంబై, రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా.. ప్రతిష్టాత్మక ఫైనల్‌ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ వేదిక కానుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ అక్టోబర్‌ 5న డిపెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య జరగనుంది.