- నేడు ఇరు జట్ల మధ్య తొలిపోరు..రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
కటక్: స్వదేశంలో వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు డిఫెండింగ్ చాంపియన్ ఇండియా అధికారిక సన్నాహాలు మొదలుపెట్టబోతున్నది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రెడీ అయ్యింది. మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో ప్రొటీస్‌తో తలపడనుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో మరో ఐదు మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. నేరుగా వరల్డ్ కప్‌లో బరిలోకి దిగనుంది. మెగా కప్‌లో ఫిబ్రవరి 7న అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. దాంతో రాబోయే 10 మ్యాచ్‌ల్లో జట్టు కూర్పు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి అంశాలపై దృష్టి పెట్టనుంది.
ఈ మ్యాచ్‌ల ద్వారా మెగా కప్‌లో ఆడే ఫైనల్ ఎలెవన్‌పై ఓ అంచనాకు రావాలని భావిస్తోంది. గత వరల్డ్ కప్‌లో ఇండియా వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు నెగ్గి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఈ ఫార్మాట్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో మన టీమ్ 26 విజయాలు సాధించింది. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే ఓడిన జట్టు ఆసియా కప్‌లో వరుసగా ఏడు విజయాలు సాధించింది. ఈ మధ్య కాలంలో టీమిండియా ఒక్క టీ20 సిరీస్ కూడా చేజార్చుకోలేదు. కాబట్టి సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లోనూ తమ ఫామ్‌ను చూపెట్టాలని ప్లాన్స్ రచిస్తోంది.
బరిలోకి గిల్, పాండ్యా..
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో మెడ గాయానికి గురైన శుభ్‌మన్ గిల్ నెల రోజుల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. గత ఐపీఎల్ నుంచి నాన్ స్టాప్‌గా క్రికెట్ ఆడుతుండటంతో అతని వర్క్‌లోడ్‌ను కూడా నిశితంగా గమనించనున్నారు. అయితే వరల్డ్ కప్‌కు ముందు గిల్‌కు ఇది మంచి ప్రిపరేషన్ టోర్నీగా మారనుంది. గత 33 మ్యాచ్‌ల్లో 837 రన్స్చేసిన అతను ఈ సిరీస్‌లో ఫామ్‌లోకి వస్తే వరల్డ్ కప్‌లో ఇండియాకు తిరుగుండదు. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు.
ఆసీస్ టూర్‌లో దుమ్మురేపిన అభిషేక్ కూడా మంచి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ 304 రన్స్ చేశాడు. ఆసియా కప్‌లో కాలిపిక్క గాయానికి గురైన హార్దిక్ పాండ్యా కూడా ముస్తాక్ అలీలో సత్తా చాటాడు. పాండ్యా రాకతో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సమతుల్యత వచ్చింది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్‌పైనే కొద్దిగా సందిగ్ధత నెలకొంది. టీ20 కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత 15 ఇన్నింగ్స్‌ల్లో 184 రన్స్ మాత్రమే చేశాడు. గత 20 మ్యాచ్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. వికెట్ కీపర్‌గా శాంసన్, జితేశ్ మధ్య పోటీ నెలకొంది. బౌలింగ్‌లో ఇండియాకు పెద్దగా ఇబ్బందుల్లేవు.
అన్రిచ్ వచ్చేశాడు..
వన్డే సిరీస్ చేజార్చుకున్న సౌతాఫ్రికా టీ20లపై దృష్టి పెట్టింది. దీంతో బలమైన జట్టునే బరిలోకి దించుతోంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత టీమ్‌కు దూరమైన పేసర్ అన్రిచ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. యాన్సెన్ నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా రాణిస్తుండటం ప్రొటీస్‌కు అదనపు బలంగా మారింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ మళ్లీ ఈ ఫార్మాట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. కాకపోతే బ్యాటర్ టోనీ డి జార్జి, బౌలర్ క్వేనా మఫాకా గాయాలతో ఈ సిరీస్‌కు దూరం కావడం ప్రతికూలాంశం. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్, బ్రెవిస్, డికాక్, మిల్లర్ మెరిస్తే భారీ స్కోరు ఖాయం.
జట్టు (అంచనా)
ఇండియా: సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ / సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా / వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
సౌతాఫ్రికా: మార్‌క్రమ్ (కెప్టెన్), డికాక్, రెజా హెండ్రిక్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, కార్బిన్ బాష్/ జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, అన్రిచ్.
1. టీ20ల్లో వంద వికెట్ల క్లబ్ చేరడానికి జస్‌ప్రీత్ బుమ్రా (99)కు కావాల్సిన వికెట్లు. మరో రెండు వికెట్లు తీస్తే హార్దిక్ పాండ్యా (98) కూడా ఈ ఘనత సాధిస్తాడు. ఇండియా నుంచి వంద వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (105).
4. మరో నాలుగు రన్స్ చేస్తే తిలక్ వర్మ వెయ్యి రన్స్ క్లబ్‌లో చేరతాడు. ఇందుకు శాంసన్ ఐదు రన్స్ దూరంలో ఉన్నాడు.
