- రిషబ్ పంత్‌కు చాన్స్ దక్కేనా ?
- బరిలోకి బవూమ, కేశవ్
- మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
రాయ్‌పూర్: డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అస్థిరంగా కనిపిస్తున్నప్పటికీ.. సౌతాఫ్రికాతో రెండో వన్డేకు టీమిండియా రెడీ అయ్యింది. బుధవారం రాయ్‌పూర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి ఇక్కడే సిరీస్‌ను పట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో టెస్ట్ సిరీస్‌లో సఫారీల చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అయితే ఇది జరగాలంటే మరోసారి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ ద్వయం తమ ఆధిపత్యాన్ని చూపెట్టాలి. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ 52వ సెంచరీతో చెలరేగితే, రోహిత్ 57 రన్స్‌తో ఆకట్టుకున్నాడు.
అయితే 2027 వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా రెండేళ్ల టైమ్ ఉండటంతో కోహ్లీ, రోహిత్ తమ ఫిట్‌నెస్, ఫామ్‌ను నిరూపించుకోవడానికి ప్రతి మ్యాచ్‌లో వీళ్లు ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల చీఫ్ కోచ్ గంభీర్‌తో ఈ ఇద్దరికి విభేదాలు తీవ్రమవుతున్నాయి. గత రెండు వన్డేల్లో చెరో సెంచరీ చేసిన విరాట్, రోహిత్ సౌతాఫ్రికాలో జరిగే వరల్డ్ కప్‌కు అందుబాటులో ఉంటారని అందరూ భావిస్తున్నారు. కానీ దీనిపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం దెబ్బతిన్నదని సమాచారం.
లైనప్‌పై గందరగోళం..
తొలి వన్డేలో నెగ్గినా.. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌పై గందరగోళం కొనసాగుతూనే ఉంది. లిస్ట్–ఎ క్రికెట్‌లో ఓపెనర్‌గా చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్‌ను నాలుగో ప్లేస్‌లో పంపారు. స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆరో ప్లేస్‌లో ఆడేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ఆల్‌రౌండర్ వాషింగ్టస్ సుందర్‌పై కూడా ప్రయోగాలు ఎక్కువయ్యాయి. గత మ్యాచ్‌లో అతను ఐదో ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. ఇండియా స్కోరును పెంచాల్సిన టైమ్‌లో సుందర్ చేతులెత్తేశాడు. బౌలింగ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఒకవేళ కోహ్లీ, రోహిత్ ఫెయిలైతే మ్యాచ్ చేజారడం ఖాయం.
కాబట్టి స్థిరమైన బ్యాటింగ్ లైనప్‌పై కోచ్, కెప్టెన్ దృష్టి పెట్టాల్సిన టైమ్ ఆసన్నమైంది. రుతురాజ్ ప్లేస్‌లో పంత్‌కు చాన్స్ రావొచ్చు. రాంచీలో కొత్త బాల్‌తో హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ రన్స్‌ను కట్టడి చేసే నైపుణ్యాన్ని కూడా అతను అలవర్చుకుంటే చాలా బాగుంటుంది. కుల్దీప్ యాదవ్ వికెట్లు తీసినా రన్స్ కట్టడి చేయడంలో ఫెయిలయ్యాడు. అర్ష్‌దీప్, ప్రసిధ్ కృష్ణ, జడేజా కూడా బాల్‌తో మెరవాల్సి ఉంది. వీళ్ల వైఫల్యంతో 11/3తో ఉన్న సౌతాఫ్రికా బలంగా పుంజుకుని దాదాపుగా మ్యాచ్‌ను గెలిచే స్థాయికి వెళ్లింది. కాబట్టి బౌలింగ్‌పై కూడా మరింత దృష్టి పెట్టాల్సిందే.
గెలుపే లక్ష్యంగా..
టెస్ట్ సిరీస్ విజయం తర్వాత విశ్రాంతి తీసుకున్న సౌతాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ బవూమ, స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు. దీంతో సఫారీ తుది జట్టులో రెండు మార్పులు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. టాప్–3లో మార్‌క్రమ్, డికాక్, రికెల్టన్ చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు.
మిడిలార్డర్‌లో బ్రీట్జ్‌కే, యాన్సెన్, బాష్, బ్రేవిస్, టోనీ డి జార్జి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. వీళ్లను కట్టడి చేస్తేనే రెండో వన్డేలో ఇండియా గెలుపు ఈజీ అవుతుంది. ఇక బౌలర్లందరూ మంచి ఫామ్‌లోనే కనిపిస్తున్నారు. అయితే కీలక టైమ్‌లో వికెట్లు తీయలేకపోవడం మైనస్‌గా మారుతోంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఉత్కంఠ పెంచుతారా? లేక టెస్ట్ సిరీస్ విజయంతో సరిపెట్టుకుంటారా? చూడాలి.
పిచ్, వాతావరణం
రాయ్‌పూర్ లో ఒకే ఒక్క డే నైట్ మ్యాచ్ 2023లో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగింది. కాబట్టి పిచ్ గురించి పెద్దగా సమాచారం లేదు. కాకపోతే బౌలర్లకు సహకరించే పిచ్ ఉండకూడదని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే నాటి మ్యాచ్‌లో కివీస్ 108 రన్స్‌కే ఆలౌటైంది. ఇప్పుడు దాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం వర్షం సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ / రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.
సౌతాఫ్రికా: టెంబా బవూమ (కెప్టెన్), మార్‌క్రమ్, డికాక్ / రికెల్టన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, టోనీ డి జార్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, నాండ్రీ బర్గర్, బార్ట్‌మన్.
