ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆజాదీకా అమృత్.. వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కాగజ్ నగర్, ఆదిలాబాద్​లో  జానపద నృత్య ప్రదర్శన చేపట్టారు. బోథ్​లో ఎమ్మెల్యే రాథోడ్​ బాపూరావు విద్యార్థులతో కలిసి డ్యాన్స్​ చేశారు. ఖానాపూర్​లో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో బైక్​ర్యాలీ తీశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రామకృష్ణాపూర్​లో ​గాంధీ, సుభాష్​చంద్రబోస్, అంబేద్కర్​ తదితర విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. కాగజ్​నగర్​లో ఆర్మీ అసోసియేషన్​ ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ నిర్వహించారు. 

అచ్ఛేదిన్​ అంటూ ధరలు పెంచిన్రు

ఆదిలాబాద్,వెలుగు: కేంద్ర ప్రభుత్వం అచ్ఛేదిన్​అంటూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యులను కష్టాలపాలు చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి నదీం జావెద్​ఫైర్​అయ్యారు. జిల్లాలోని బేల, జైనథ్​మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆజాదీకా గౌరవ్​ పాదయాత్ర’కు ఆయన హాజరయ్యారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​పార్టీ హయాంలో దేశంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి సమర్థవంతమైన పాలన అందించిందన్నారు. ప్రస్తుతం  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. సమావేశంలో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఇన్​చార్జి మహేశ్వర్ రెడ్డి, మైనార్టీ చైర్మన్ సోహెల్, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ వైపు యువత చూపు

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: యువకులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్​చెప్పారు. ఆదివారం జందాపూర్ గ్రామ యువకులు బీజేపీలో చేరగా ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాయల్​శంకర్​మాట్లాడుతూ తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువతకు కేసీఆర్ నిరాశ మిగిల్చారన్నారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని యువత బలపరుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో లీడర్లు మయూర్ చంద్ర, నరేందర్ డోఖ్వాల్, సాయి నరేశ్, లింగన్న పాల్గొన్నారు.

పేకాడుతున్న 13 మంది అరెస్టు, రూ.5.11.540 స్వాధీనం

ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ మండలం బాదన్​కుర్తి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో పేకాడుతున్న 13 మందిని ఆదివారం అరెస్టు చేసినట్లు సీఐ అజయ్ బాబు తెలిపారు. నిర్మల్ సీసీఎస్​సిబ్బంది, ఖానాపూర్ పోలీసులు పేకాట స్థావరంపై దాడిచేసినట్లు వివరించారు. మూడు కార్లు, బైక్, రూ.5,11,540 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ దాడిలో సీసీఎస్ సీఐ కుమార స్వామి, ఎస్సై రజనీకాంత్​తదితరులు పాల్గొన్నారు.

అఖండ భారత్ స్థాపనే లక్ష్యం

ఆదిలాబాద్​టౌన్,వెలుగుఅఖండ భారత్ స్థాపనే ధ్యేయంగా కృషి చేయాలని వీహెచ్​పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథ్​ పటేల్​ కోరారు. ఆదివారం ఆదిలాబాద్ లోని తెలంగాణ చౌక్​లో అఖండ భారత్​ దివస్​ఘనంగా నిర్వహించారు. కొన్ని విదేశీ, స్వదేశీ శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి యత్నస్తున్నాయని లీడర్లు ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి, వీహెచ్ పీ, భజరంగ్​దళ్​లీడర్లు పాల్గొన్నారు.

స్వరాజ్య స్థాపనే ధ్యేయం

ఆదిలాబాద్,వెలుగు: దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ చేపట్టిన 10 వేల కిలో మీటర్ల పాదయాత్ర ఆదివారం మండలంలోని అర్లి, లాండ సాంగ్వి గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా విశారదన్​మహాజార్​ఆయా గ్రామాల్లో డీఎస్పీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ లో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల స్వరాజ్య స్థాపనే ధ్యేయంగా పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  డీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణేశ్, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, అడ సర్పంచ్ పాయల్ శరత్, మండల అధ్యక్షుడు గంగన్న, రాజు పాల్గొన్నారు.