అందరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉండాలి

అందరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉండాలి
  • మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్: అమరవీరుల త్యాగాలతోనే స్వాతంత్ర్యం  వచ్చిందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శంషాబాద్ సమీపంలోని స్వర్ణభారతి ట్రస్ట్ లో స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు, అమరవీరులకు నివాళులర్పించారు. 


ఈ సందర్బంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.  ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న మనం.. ఇప్పటికీ కొన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని.. సాంఘిక దురాచారాలు.. అసమానతలు కనిపిస్తున్నాయని.. ఈ అసమానతలను సమూలంగా తొలగించాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు అన్నారు.

 

ప్రపంచంలో ముందుకు వెళ్తున్న దేశంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ దేశంలో ఇప్పటికీ రాయడం.. చదవడం రాని ముందు తరాల వారిని విద్యావంతులు చేయాలన్నారు. అలాగే అక్కడక్కడ మతపరమైన ఉద్రిక్తతలు.. సాంఘిక వివక్ష.. స్త్రీ పురుష లింగ వివక్షతలు కనిపిస్తున్నాయని.. వీటిని నిర్మూలించాలన్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించి వారు మనలో సగ భాగం అని గుర్తించాలని సూచించారు. అలాగే పట్టణాలు .. గ్రామాలకు మధ్య వ్యత్యాసం ఉండకుండా పట్టణాల్లో ఉండే అన్ని సౌకర్యాలు గ్రామాల్లో  కల్పించాలన్నారు. ముఖ్యంగా దేశంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు. కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.