
ఇంగ్లాండ్ టూర్ కు ముందు భారత యువ క్రికెటర్లు సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో యంగ్ ఇండియా రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. తొలి టెస్ట్ మే 30 నుండి కాంటర్‌బరీలోని స్పిట్‌ఫైర్ గ్రౌండ్‌లో జరుగుతుంది. రెండో టెస్ట్ జూన్ 6 నుండి నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరుగుతుంది. జూన్ 13న బెకెన్‌హామ్‌లో టీమ్ ఇండియాతో జరిగే ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌తో తమ పర్యటనను ముగించనుంది. అభిమన్యు ఈశ్వరన్ నేతృత్వంలోని ఇండియా ఏ జట్టు ప్లేయర్స్ ఆదివారం (మే 25) ఇంగ్లాండ్ కు చేరుకున్నారు.
పేసర్ తుషార్ దేశ్‌పాండే రుతురాజ్ గైక్వాడ్, తనుష్ కోటియన్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ అభిమన్యులతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి, "వర్క్ క్రూ" అనే క్యాప్షన్ ఇచ్చారు. అభిమన్యు ఈశ్వరన్ భారత ఏ జట్టుకు నాయకత్వం వహిస్తారు. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ట్రిపుల్ సెంచరీ వీరుడు కరుణ్ నాయర్ పైనే అందరి దృష్టి నెలకొంది. 20 మందితో కూడిన స్క్వాడ్ లో టెస్ట్ రెగ్యులర్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ కూడా ఉన్నారు. గిల్, సాయి సుదర్శన్ ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరపున ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉండడంతో వీరు త్వరలో జట్టులో చేరనున్నారు.
ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్ లు జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయం కారణంగా ఐపీఎల్ 2025 కు దూరమైన రుతురాజ్ గైక్వాడ్ తో పాటు సర్ఫరాజ్ ఖాన్ సెలక్టయ్యాడు. ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలర్లుగా జట్టులో స్థానం దక్కించుకున్నారు. 2024/25 రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మానవ్ సుతార్ తో పాటు తనుష్ కోటియన్, అన్షుల్ కాంబోజ్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దుబే వంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కూడా సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.
ఇంగ్లండ్ టూర్‌కు భారత ఎ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, హర్షిత్ కమ్‌ద్‌రాజ్, హర్షిత్ రణా గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే.