చిన్న చేధనలో చతికిలపడ్డ ఇండియా–ఎ విమెన్స్‌‌ జట్టు.. ఆసీస్‌-ఎ చేతిలో ఓటమి

చిన్న చేధనలో చతికిలపడ్డ ఇండియా–ఎ విమెన్స్‌‌ జట్టు.. ఆసీస్‌-ఎ చేతిలో ఓటమి

మెక్‌‌కే: ఆస్ట్రేలియా టూర్‌‌లో ఇండియా–ఎ విమెన్స్‌‌ జట్టు శుభారంభం చేయలేకపోయింది. చిన్న టార్గెట్‌‌ ఛేదనలో రాఘవి బిస్త్‌‌ (20 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 33), ఉమా ఛెత్రి (31 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 31), రాధా యాదవ్‌‌ (26 నాటౌట్‌‌) రాణించినా మిగతా వారు ఫెయిల్‌‌ కావడంతో.. శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఇండియా 13 రన్స్‌‌ తేడాతో ఆసీస్‌‌ చేతిలో ఓడింది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో హోమ్‌‌ టీమ్‌‌ 1–0 లీడ్‌‌లో నిలిచింది. టాస్‌‌ ఓడిన ఆస్ట్రేలియా–ఎ 20 ఓవర్లలో 137/6 స్కోరు చేసింది. అనికా లియరాయిడ్ (44 బాల్స్‌‌లో 7 ఫోర్లతో 50 నాటౌట్‌‌) హాఫ్‌‌ సెంచరీతో ఆకట్టుకుంది. 

ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన ఇండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఆసీస్  భారీ స్కోరు కాకుండా అడ్డుకున్నారు. టాపార్డర్‌‌లో అలీసా హీలీ (27), తాలియా విల్సన్‌‌ (17) ఫర్వాలేదనిపించినా మిడిలార్డర్‌‌లో విఫలమైంది. ప్రేమ్‌‌ రావత్‌‌ (3/15) మూడు కీలక వికెట్లతో దెబ్బకొట్టింది.  కోర్ట్నీ వెబ్ (11), కెప్టెన్‌‌ నికోల్‌‌ ఫాతుమ్‌‌ (11), మడేలిన్ పెన్నా (6), టెస్‌‌ ఫ్లింటాఫ్‌‌ (2) నిరాశపర్చారు. సైమా ఠాకూర్‌‌, సాజీవన్ సాజన చెరో వికెట్ తీశారు. తర్వాత ఛేజింగ్‌‌లో ఇండియా 20 ఓవర్లలో 124/5 స్కోరుకే పరిమితమైంది. ఇన్నింగ్స్‌‌ నాలుగో ఓవర్‌‌లోనే షెఫాలీ వర్మ (3) ఔటవడంతో ఇండియా డీలా పడింది.

 ఓ ఎండ్‌‌లో ఉమా ఛెత్రి నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌‌లో తొమ్మిది బాల్స్‌‌ తేడాలో ధారా గుజ్జర్‌‌ (7), దినేశ్‌‌ వ్రిందా (5) ఔటయ్యారు. మరో మూడు బాల్స్‌‌ తర్వాత ఛెత్రి కూడా వెనుదిరగడంతో ఇండియా 52/4తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో రాఘవి బిస్త్‌‌, రాధా యాదవ్‌‌ కీలక ఇన్నింగ్స్‌‌ ఆడారు. కంగారూల బౌలింగ్‌‌ను దీటుగా ఎదుర్కొంటూ ఐదో వికెట్‌‌కు 52 రన్స్‌‌ జత చేసి ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టారు. అయితే 17వ ఓవర్లో బిస్త్‌‌ ఔట్‌‌ కావడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు. అమీ ఎడ్గర్‌‌, సియానా జింజెర్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు.  రెండో మ్యాచ్‌‌ 
శనివారం జరుగుతుంది.