
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియా ఏ జట్టుపై సత్తా చాటింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై రెండు వికెట్ల తేడాతో భారీ ఛేజింగ్ చేసి సిరీస్ నెగ్గింది. ఆదివారం (అక్టోబర్ 5) కాన్పూర్ వేదికగా జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్ లో ఇండియా తరపున ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (68 బంతుల్లో 102: 8 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఏ 49.1 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ఇండియా 46 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి విజయం సాధించింది.
318 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా ఏ ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. ఆశ్చర్యకరంగా ఒక ఎండ్ లో అభిషేక్ శర్మ కుదురుకోవడానికి సమయం తీసుకుంటే మరో ఎండ్ లో సిమ్రాన్ సింగ్ బౌండరీల మోత మోగించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 83 పరుగులు జోడించిన తర్వాత 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అభిషేక్ శర్మ ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే తిలక్ వర్మ కూడా ఔట్ కావడంతో ఇండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. ఉన్నంత సేపు వేగంగా ఆడిన సిమ్రాన్ సింగ్ 68 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకొని ఔటయ్యాడు.
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (62), రియాన్ పరాగ్ (62) సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరూ పెవిలియన్ కు చేరడంతో మ్యాచ్ ఉత్కంఠకు చేరుకుంది. చివర్లో విప్రాజ్ నిగమ్ జాగ్రత్తగా ఆడుతూ విన్నింగ్ రన్స్ కొట్టాడు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌట్ అయింది. కూపర్ కొన్నూళ్లి (64), కెప్టెన్ జాక్ ఎడ్ వర్డ్స్ (89), లియాన్ స్కాట్ (73) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇండియన్ బౌలర్లలో హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పరాగ్ కు లభించింది.