ఐరాస భద్రతామండలిలో ఓటింగ్కు భారత్ దూరం

ఐరాస భద్రతామండలిలో ఓటింగ్కు భారత్ దూరం

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, ఆల్బేనియా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్ కు చెందిన నాలుగు భూభాగాలు తమదేశంలో వీలినం అయ్యాయంటూ రష్యా ప్రకటనకు వ్యతిరేకంగా ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. భద్రతామండలిలో 15దేశాలకు గానూ 10దేశాలు ఈ తీర్మానానికి మద్ధతుగా ఓటెయ్యగా భారత్, చైనా, బ్రెజిల్, గాబన్ దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. అయితే తన అధికారంతో రష్యా ఈ తీర్మానాన్ని వీటో చేసింది. 

ఉక్రెయిన్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై భారత్ తీవ్రంగా కలతచెందిందని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ యూఎన్లో అన్నారు. మనుషుల ప్రాణాలను పణంగా పెట్టి ఎటువంటి పరిష్కారాలు సాధించలేమని వ్యాఖ్యానించారు.  హింసను నిలిపివేయడానికి ఇరుపక్షాలు చర్చలు జరపాలని..వివాదాలు, విభేధాలను పరిష్కరించడానికి చర్చలే సమాధానమన్నారు. 

ఒకదేశం మరో దేశం భూభాగాన్ని ఆక్రమించుకోవడం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటర్రెస్ అన్నారు. నాలుగు భూభాగాలను తమదేశంలో విలీనం చేసుకుంటూ రష్యా తీసుకున్న నిర్ణయానికి న్యాయపరమైన విలువ ఉండదన్నారు. అంతర్జాతీయ న్యాయ చట్రంలో దీనిని పరిగణలోకి తీసుకోలేమని చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించి డొనెత్క్స్, లుహాన్స్క్, ఖేర్సాన్, జపోరిఝుయాలను తమదేశంలో విలీనం చేసుకుంటున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించాడు.