ఇండియా లక్ష్యం.. ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్: మోదీ

ఇండియా లక్ష్యం.. ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్: మోదీ
  •     ఫుడ్ వేస్టేజ్​ తగ్గించాలి: మోదీ
  •     మిల్లెట్స్ అన్ని దేశాలకు విస్తరించాలి
  •     ప్రాసెసింగ్ రంగంలో మహిళల సేవలు భేష్
  •     ‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2023’ ప్రారంభోత్సవంలో ప్రధాని

న్యూఢిల్లీ: ఫుడ్ వేస్టేజ్ తగ్గించడమే లక్ష్యంగా ఇండియా ముందుకెళ్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సన్​రైజ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ రంగంలో గడిచిన తొమ్మిదేండ్లలో రూ.50వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయన్నారు. ‘ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్’గా ఇండియా అవతరించడమే తమ లక్ష్యమని తెలిపారు. పోస్ట్ హార్వెస్టింగ్ నష్టాలు, ఫుడ్ వేస్టేజ్​ను తగ్గించాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ కెపాసిటీ కూడా పెరిగిందన్నారు. 

ప్రాసెస్ చేసిన ఫుడ్ ఎక్స్​పోర్ట్​లో 150 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కూడా 12 లక్షల టన్నుల నుంచి 200 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్.. భారత్ మండపంలో ‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2023’ రెండో ఎడిషన్​ను శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగబోయే ఈవెంట్​లో పలు కంపెనీల సీఈవోలతో పాటు 80 దేశాల ప్రతినిధులు, 200 మంది వక్తలు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. 

2023ని ప్రపంచ దేశాలన్నీ మిల్లెట్ ఇయర్​గా జరుపుకుంటున్నాయని వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం పీఎల్ఐ స్కీమ్ తీసుకొచ్చిందన్నారు. మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేసిందని వివరించారు.

మాది ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్

ఎన్నో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు తీసుకొచ్చామని మోదీ అన్నారు. ఈ స్కీమ్స్ ప్రపంచ స్థాయిలో ఇండియాను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని తెలిపారు. ఫుడ్ ఎక్స్​పోర్ట్​ కూడా తొమ్మిదేండ్లలో 13 శాతం నుంచి 23 శాతానికి పెంచామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఇండియాలోని ప్రతి మహిళకు ఉందని తెలిపారు. ఇండియన్ ఫుడ్ కల్చర్​కు వేల ఏండ్ల సంస్కృతి ఉందన్నారు. పూర్వీకులు ఆహారపు అలవాట్లను ఆయుర్వేదానికి లింక్ చేశారని తెలిపారు. 

సుస్థిరమైన జీవనశైలి లక్ష్యం సాధించాలంటే.. ఫుడ్ వేస్టేజ్ తగ్గించడం ఏకైక మార్గమని చెప్పారు. వేస్టేజ్ తగ్గించి.. ఉత్పత్తులు పెంచాలని సూచించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన జీ20 సదస్సుకు హాజరైన అతిథులకు మిల్లెట్స్ మీల్స్ పెట్టామని గుర్తు చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు మిల్లెట్స్ చేరుకుంటాయనే నమ్మకం తనకు ఉందన్నారు. 

ఎన్నో కంపెనీలు మిల్లెట్స్ ఆధారిత ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాయని తెలిపారు. దేశంలోని 10 కోట్ల మంది చిన్నారులు, గర్భిణులకు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్​ప్రైజెస్ స్కీమ్ కింద లక్ష స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.380 కోట్ల సీడ్ క్యాపిటల్ రిలీజ్ చేశారు.