
- ప్రారంభమైన రాష్ట్ర కమిటీ సమావేశాలు
హైదరాబాద్, వెలుగు: పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ఏ.విజయరాఘవన్ అన్నారు. దీని కోసం దేశంలోని ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని, ఇండియా కూటమి మరింత బలపడాలని ఆకాంక్షించారు. రెండు రోజుల సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధవారం హైదరాబాద్లోని ఎంబీ భవన్ లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. కమిటీ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, అనుభవాలపై చర్చించామని విజయరాఘవన్ వెల్లడించారు. దేశంలోని ప్రజాస్వామిక, లౌకిక శక్తులను ఏకం చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు.
లౌకికవాదంపై దాడులు బాధాకరం
దేశంలో మైనార్టీలు, ప్రజాస్వామ్యం, లౌకికవాదంపై దాడులు బాధాకరమని విజయరాఘవన్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలోనూ కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలోని పార్టీలన్నీ బీజేపీ వ్యూహాలపై చర్చించాలని సూచించారు. ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు. తాము పేదలు ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సమస్యలపై అధ్యయనం చేసి విస్తృత ప్రచారం చేపడతామని విజయరాఘవన్ పేర్కొన్నారు. సమావేశంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.