- మూడో స్థానం కోసం సుదర్శన్, పడిక్కల్ మధ్య పోటీ
- మానవ్ సుతార్, హర్ష్ దూబేలో ఒక్కరికే చాన్స్
- ఉ. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్
ముల్లాన్‌పూర్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కీలక మ్యాచ్‌లకు ముందు లోపాలను సరిచేసుకోవడానికి టీమిండియా రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సరైన కాంబినేషన్‌ను రూపొందించుకోవడానికి ఈ మ్యాచ్ ఇండియాకు ఓ మంచి అవకాశం కానుంది. 2018లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ ఘోరంగా ఓటమిపాలైంది.
రెండో రోజు లంచ్, టీ విరామానికి మధ్యే 10 వికెట్లు కోల్పోగా, ఆ తర్వాత మరో 10 వికెట్లు చేజార్చుకుంది. దాంతో ఒకే రోజులో మ్యాచ్ ముగిసింది. అయితే ఇప్పుడు టీమిండియా పరివర్తనా దశలో ఉండటంతో కొత్త కాంబినేషన్లతో ప్రయోగం చేస్తోంది. కాబట్టి హష్మతుల్లా షాహిది నేతృత్వంలోని అఫ్గాన్‌ను తక్కువగా అంచనా వేస్తే ప్రమాదం తప్పకపోవచ్చు.
మూడో నంబర్‌లో సుదర్శన్..
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ముందే హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్‌శుభ్‌మన్ గిల్ కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సి ఉంది. ముఖ్యంగా మూడో స్థానంలో నమ్మకమైన బ్యాటర్‌తో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయాలి. ప్రస్తుతం మూడో నంబర్ కోసం సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. సుదర్శన్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తామని ఇప్పటికే గౌతీ కూడా స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లో జడేజాకు విశ్రాంతి ఇచ్చారు.
అయితే విదేశాల్లో జడ్డూ ఫామ్ సూపర్‌గా ఉన్నా.. స్వదేశంలో మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. అయినా టెస్ట్ బ్యాటింగ్ ఫామ్ బాగుండటంతో అతని ప్లేస్‌కు ఎలాంటి ఢోకా లేదు. అయినా సరే భవిష్యత్ కోసం ఇద్దరు కొత్త ప్లేయర్లను సెలెక్టర్లు ఇప్పటికే గుర్తించారు. స్లో లెఫ్టార్మ్ బౌలర్ మానవ్ సుతార్, ఆల్‌రౌండర్ హర్ష్ దూబే ఈ ప్లేస్ కోసం పోటీపడుతున్నారు. రెండు రోజుల నెట్ ప్రాక్టీస్‌లో సుతార్ అనుకున్న స్థాయిలో రాణించినట్లుగా తెలుస్తోంది. దూబే డిఫెన్సివ్ బౌలర్ అయినా.. భారీ హిట్టింగ్ చేయగల సమర్థుడు. కాబట్టి ఇద్దరిలో ఎవర్ని తీసుకుంటారనేది ఆసక్తికరం.
ప్రాక్టీస్ మ్యాచ్‌లు సరిపోతాయా..?
ఈ మ్యాచ్ కోసం అఫ్గాన్ జలాలాబాద్‌లో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుంది. కానీ టెస్ట్‌ల్లో ఇండియాను ఎదుర్కోవాలంటే ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఏమాత్రం సరిపోవు. ఎందుకంటే 2018 నుంచి ఇప్పటి వరకు అఫ్గాన్ 11 టెస్ట్‌లు ఆడితే ఇండియా 67 మ్యాచ్‌లు ఆడింది. 2018నాటి ఇండియా జట్టులో కేఎల్ రాహుల్ ఒక్కడే ప్రస్తుతం టీమ్‌తో పాటు ఉన్నాడు.
అఫ్గాన్ జట్టులో కెప్టెన్ షాహిది, రహమత్ షాకు మాత్రమే అనుభవం ఉంది. అఫ్గాన్ బ్యాటింగ్ లైనప్ మొత్తం చేసిన సెంచరీలు 9 అయితే.. ఇండియన్ బ్యాటర్లు 39 సెంచరీలు కొట్టారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ గట్టి పోటీ ఇస్తుందా? లేదా? చూడాలి. దీనికి తోడు విపరీతమైన ఎండలు కూడా ప్లేయర్లపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి.
జట్లు (అంచనా)
ఇండియా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే / మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
అఫ్గానిస్తాన్: హష్మతుల్లా షాహిది (కెప్టెన్), సెడిఖుల్లా అటల్, రహమతుల్లా గుర్బాజ్, రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రెహమానుల్లా, అఫ్సర్ జజాయ్, షర్ఫుద్దీన్ అష్రాఫ్, నంగెలియాలియ ఖరోటె, క్వైస్ అహ్మద్, జియావుర్ రెహమాన్.
పిచ్, వాతావరణం
నల్ల రేగడి మట్టితో కూడిన పిచ్. బ్యాటర్లకు అనుకూలం. వర్షం ముప్పు లేకపోయినా ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది.
30టెస్ట్‌ల్లో వెయ్యి రన్స్ పూర్తి చేసిన తొలి అఫ్గాన్ బ్యాటర్‌గా నిలిచేందుకు రహమత్ షాకు అవసరమైన పరుగులు.
50రిషబ్ పంత్‌కు ఇది 50వ టెస్ట్, టీమిండియా వికెట్ కీపర్‌గా ధోనీ (90), సయ్యద్ కిర్మాణీ (88) మాత్రమే ఎక్కువ మ్యాచ్‌లు ఆడారు.
157 టెస్ట్‌ల్లో 3 వేల రన్స్ పూర్తి చేయడానికి గిల్‌కు అవసరమైన పరుగులు.
