ఇండియా, చైనా బార్డర్ గొడవపై కొనసాగుతున్న రగడ

ఇండియా, చైనా బార్డర్ గొడవపై కొనసాగుతున్న రగడ

న్యూఢిల్లీ: ఇండియా, చైనా బార్డర్ గొడవపై పార్లమెంటులో రగడ కొనసాగుతున్నది. శీతాకాల సమావేశాల్లో వరుసగా రెండో రోజు ప్రతిపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. అరుణాచల్‌‌ ప్రదేశ్‌‌లోని తవాంగ్ వద్ద ఇండియా, చైనా సైనికుల మధ్య జరిగిన గొడవపై చర్చ జరపాలని పట్టుబట్టారు. రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సున్నిత అంశమన్న కారణంతో చర్చకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో ఉభయ సభల నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.

నాడు నెహ్రూ చర్చించారు కదా: ఆధిర్

బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌‌సభ ప్రారంభం కాగానే.. పలు అంశాలను కాంగ్రెస్, డీఎంకే సభ్యులు లేవనెత్తారు. క్వశ్చన్ అవర్ చాలా ముఖ్యమని, ఇది సభ్యులకు ఉద్దేశించినదేనని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. కానీ సభ్యులు తమ నిరసనలు కొనసాగించారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు వాకౌట్ చేశారు. ‘నహీ చలేగా’ అంటూ కొందరు నినాదాలు చేశారు. కొద్ది సేపటికి  కొందరు సభ్యులు తిరిగి వచ్చారు. క్వశ్చన్ అవర్ ముగియగానే మాట్లాడిన కాంగ్రెస్ పక్ష నేత ఆధిర్ రంజన్ చౌదరి.. ఇండో చైనా బార్డర్ పరిస్థితిపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ‘‘1962లో జరిగిన ఇండియా – చైనా యుద్ధంపై దివంగత ప్రధాని జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ.. లోక్‌‌సభలో చర్చకు అనుమతించారు. 165 మంది ఎంపీలు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. ఏం చేయాలనే దానిపై చర్చ తర్వాతే నిర్ణయం తీసుకున్నారు” అని తెలిపారు. దీనిపై స్పందించిన ఓం బిర్లా.. బీఏసీ మీటింగ్‌‌లో నిర్ణయం తీసుకుంటామన్నారు. తర్వాత ప్రొసీడింగ్స్ కొనసాగించారు. దీంతో సోనియా ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ఎంపీలు, టీఎంసీ సభ్యులు బార్డర్ గొడవపై చర్చకు అనుమతివ్వనందుకు నిరసనగా లోక్‌‌సభ నుంచి వాకౌట్ చేశారు.

ప్రభుత్వం జవాబు చెప్పాలి: శశిథరూర్

బార్డర్ గొడవపై క్లారిఫికేషన్ లేకుండా చిన్న ప్రకటన చేసి.. ఇతరుల ప్రశ్నలు, అభిప్రాయాలను వినకపోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘చైనా సైనికులు 2017 నుంచి ఎల్‌‌ఏసీ వెంబడి కొంచెం కొంచెం చొచ్చుకుని వస్తున్నారు. డోక్లాంతో మొదలు పెట్టి.. ఇప్పుడు తవాంగ్‌‌ దాకా వచ్చారు. గల్వాన్, డెప్సంగ్, హాట్‌‌ స్ప్రింగ్స్ సంఘటనలు జరిగాయి. ఇలాంటి విషయాలపై ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి” అని అన్నారు. ప్రభుత్వం దీనిపై రివ్యూ చేయాలని, ప్రజలతో మాట్లాడాలని, పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజ్యసభలోనూ సేమ్ సీన్

రాజ్యసభ ప్రారంభం కాగానే.. బార్డర్ గొడవపై ప్రతిపక్ష నేత ఖర్గే సహా ఇతర పార్టీల నేతలు చర్చకు పట్టుబట్టారు. చైనా దురాక్రమణపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు చర్చ జరపాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని ఖర్గే అన్నారు. అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటో దేశానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ స్థలంలో చైనా వంతెనలు నిర్మించినట్లు తమకు కొంత సమాచారం ఉందన్నారు. ఈ విషయంలో తమకు ప్రతిపక్షాలేవీ నోటీసు ఇవ్వలేదని, చర్చకు అనుమతివ్వడం కుదరదని డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ చెప్పారు. జీరో అవర్‌‌‌‌లో లిస్టయిన అంశాలను చర్చించాలని సూచించారు. ఇదేమీ పట్టించుకోకుండా ఖర్గే మాట్లాడటంతో.. ఆయన మైక్ కట్ చేశారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు కాసేపు నినాదాలు చేశారు. రక్షణ మంత్రి చేసిన ప్రకటన సున్నితమైన అంశమని, దానిపై క్లారిఫికేషన్స్‌‌కు అనుమతించలేనని తాను మంగళవారమే స్పష్టం చేశానని డిప్యూటీ చైర్మన్ చెప్పారు. ఆయన ప్రకటనతో అపొజిషన్ ఎంపీలు సంతృప్తి చెందలేదు. జీరో అవర్ జరుగుతుండగానే.. కాంగ్రెస్, ఆర్జేడీ, ఆప్, ఎండీఎంకే, సీపీఎం, జేడీయూ, డీఎంకే, టీఎంసీ, టీడీపీ, శివసేన తదితర 17 పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు.