ఇండో-పాక్ తీరంలో హైటెన్షన్.. పోటా పోటీగా నేవీ డ్రిల్స్.. కమ్ముకున్న యుద్ధ మేఘాలు..

ఇండో-పాక్ తీరంలో హైటెన్షన్.. పోటా పోటీగా నేవీ డ్రిల్స్.. కమ్ముకున్న యుద్ధ మేఘాలు..

ఇండియా-పాకిస్తాన్ తీర ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పహల్గాం దాడికి సరైన బుద్ధి చెప్పాలనే కసితో ఉన్న ఇండియా.. త్రివిధ దళాలలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన వేళ.. గుజరాత్ తీరంలో ఇండియన్ నేవీ డ్రిల్స్ ప్రారంభించింది. పాకిస్తాన్ కు 85 మైళ్ల దూరంలో నేవీ డ్రిల్స్ మొదలుపెట్టింది. దీంతో పోటీగా పాకిస్తాన్ నేవీ కూడా తీర ప్రాంతంలో డ్రిల్స్ ప్రారంభించింది. తీర ప్రాంతంలో ఇరు దేశాల నేవీ డ్రిల్స్ తో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 

అరేబియా మహా సముద్ర తీరంలో ఇరు దేశాలు నిర్వహిస్తున్న డ్రిల్స్ తో తీర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుజరాత్ తీరంలో ఏప్రిల్ 30 నుంచి మే 3వ తేదీ వరకు భారత నేవీ డ్రిల్స్ నిర్వహిస్తోంది. దీనికి పోటీగా పాక్ జలాల్లో ఆ దేశ నేవీ ఏప్రిల్30 నుంచి మే 2 వరకు డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఇరు దేశాల డ్రిల్స్ ప్రాక్టీస్ చేస్తుండటంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. 

పహల్గాం ఘటనకు  ధీటుగా బదులుచ్చేందుకు నేవీ సన్నద్ధమైంది. బుధవారం (ఏప్రిల్ 30) నేవీని సిద్ధం చేస్తున్నట్లుగా ప్రకటించింది. ‘‘నేవీ సిద్ధమవుతోంది.. మిషన్ మరీ దూరంలో లేదు.. ఏ సముద్రం మరీ పెద్దది కాదు’’ అని ఎక్స్ లో పోస్ట్ చేసింది.  నేవీ సిద్ధంగా ఉండటమే కాకుండా.. దాడి ఎప్పుడైనా జరగొచ్చుననే సంకేతాలు ఈ మేసేజ్ ద్వారా పంపింది. 

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఉగ్రమూకలు కురిపించిన తుటాల వర్షానికి 28 మంది పర్యాటకులు బలయ్యారు. ఈ ఉగ్రదాడి వెనక పాక్ హస్తం ఉన్నట్లు గుర్తించిన భారత్.. దాయాది దేశంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పాక్‎తో పూర్తిగా దౌత్య సంబంధాలు తెంచుకుని.. పలు ఆంక్షలు విధించింది. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని పాక్‎ను దెబ్బకొట్టింది.