భారత్, పాక్​ సంయమనం పాటించాలి..‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ప్రపంచ నాయకుల స్పందన

భారత్, పాక్​ సంయమనం పాటించాలి..‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ప్రపంచ నాయకుల స్పందన

వాషింగ్టన్/మాస్కో: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే), పాకిస్తాన్‌‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మిసైల్​ఎటాక్స్​చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’గా పేర్కొనే దీనిపై ప్రపంచ నాయకులు స్పందించారు. భారత్, పాకిస్తాన్‌‌ సంయమనం పాటించాలని, శాంతియుత మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.

సంయమనం పాటించాలి: యూఎన్​ 

‘‘భారత్, పాకిస్తాన్ దేశాలు రెండూ కూడా ‘గరిష్ట సైనిక సంయమనం’ పాటించాలి. ప్రపంచం ఈ2 దేశాల మధ్య సైనిక ఘర్షణను భరించలేదు’’ అని ఐక్యరాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ తెలిపారు.

మధ్యవర్తిత్వానికి నేను రెడీ: ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ‘‘ఇండియా, పాకిస్థాన్​ దేశాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి, దశాబ్దాలుగా కొనసాగుతున్న శత్రుత్వానికి, వైషమ్యాలు చాలా తర్వగా ముగుస్తాయని విశ్వసిస్తున్న. మధ్యవర్తిత్వానికి నేను సిద్ధంగా ఉన్న”అని అన్నారు. అలాగే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నట్లు తెలిపారు.

చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలి: రష్యా

భారత్, -పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ పెరగడంపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘1972 సిమ్లా ఒప్పందం, 1999 లాహోర్ డిక్లరేషన్‌‌కు అనుగుణంగా ద్వైపాక్షిక శాంతియుత రాజకీయ మార్గాల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలి’’ అని కోరారు.

2 దేశాలూ మాకు స్నేహితులే..: యూకే

జమ్మూ కాశ్మీర్‌‌లోని పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని బ్రిటన్ వ్యాపార, వాణిజ్య కార్యదర్శి జోనాథన్ రేనాల్డ్స్ అన్నారు. ‘‘మేము రెండు దేశాలకు స్నేహితులం, భాగస్వాములం. చర్చలు ఉద్రిక్తతలు తగ్గించే దిశగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నం”  అని రేనాల్డ్స్ అన్నారు. అలాగే యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ రెండు దేశాలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.

టెన్షన్లు తగ్గించాలి: యూఏఈ

‘‘రెండు దేశాలు సంయమనం పాటించాలి, టెన్షన్లు తగ్గించాలి. సంక్షోభాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి దౌత్యం, చర్చలు అత్యంత ప్రభావవంతమైన మార్గాలు’’ అని యూఏఈ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పేర్కొన్నారు.

శాంతి స్థాపించాలి:చైనా

‘‘ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వం కోసం రెండు దేశాలు సంయమనం పాటించాలి. అంతర్జాతీయ సమాజంతో కలిసి ప్రస్తుత టెన్షన్లు తగ్గించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాము’’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు.

ఉద్రిక్తతలు గమనిస్తున్నాం: ఖతార్

భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఆందోళనతో గమనిస్తున్నట్లు ఖతార్ విదేశాంగ మంత్రిత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘అత్యంత సంయమనం పాటించాలి, దౌత్యం ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలి. చర్చలకు ద్వారాలు తెరిచి ఉంచడం ద్వారా సమగ్ర పరిష్కారాలు సాధించాలి”అని సూచించింది.

చర్చించుకోవాలి: జపాన్​

భారత్, పాక్​మధ్య పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నట్లు జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ యోషిమాసా హయాషి తెలిపారు. ‘‘ప్రతీకార దాడులు పూర్తి స్థాయి సైనిక ఘర్షణగా మారే ప్రమాదం ఉంది. శాంతి, స్థిరత్వం కోసం సంయమనం పాటించాలి, చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలి” అని రెండు దేశాలను కోరారు.