
న్యూఢిల్లీ: మేకిన్ ఇండియాలో భాగంగా రష్యాతో కలసి ఏకే 203 రైఫిల్స్ తయారీ డీల్ మొత్తానికి ఫైనల్ అయిందని సమాచారం. ఫైనల్ కాంట్రాక్ట్ పై సంతకాలు చేయడానికి ముందు ఇరు వర్గాలు చట్టపరంగా చర్చించనున్నాయని తెలుస్తోంది. ఈ డీల్ కింద సుమారు 6 లక్షల రైఫిల్స్ ను ఈ ఏడాది ముగిసేలోపు ఉత్పత్తి చేయనున్నారు. తొలుత 20 వేల ఏకే 203 రైఫిల్స్ ను తయారీ చేయనున్నారు. వీటిని రష్యా నుంచి రూ.80 వేలకు ఒక్కొక్కటి చొప్పున భారత్ కు దిగుమతి చేసుకోనున్నారని తెలిసింది. మిగిలిన గన్స్ మాత్రం ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ కింద ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ కానున్నాయి. ఈ ఒప్పందం ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఓఎఫ్ బీ), కలషింకోవ్ కన్సర్న్, రష్యన్ స్టేట్ ఏజెన్సీ అయిన రొసొబోరోన్ ఎక్స్ పోర్ట్ మధ్య జరిగింది. దీంట్లో ఓఎఫ్ బీకి 50.5 శాతం, కలషింకోవ్ కు 42 శాతం, రొసొబోరోన్ ఎక్స్ పోర్ట్ కు 7.5 శాతం వాటా ఉంది. ఈ డీల్ ను 2018లోనే ప్రకటించారు. కానీ ఓఎఫ్ బీతో ధరల విషయం ఎటూ కొలిక్కి రాకపోవడంతో ఇప్పటిదాకా ఆలస్యమవుతూ వచ్చింది.