సెప్టెంబర్ 16న భారత్‌‌కు యూఎస్ వాణిజ్య ప్రతినిధి..

సెప్టెంబర్ 16న  భారత్‌‌కు యూఎస్ వాణిజ్య ప్రతినిధి..

న్యూఢిల్లీ: టారిఫ్‌‌లతో మన దేశాన్ని ట్రంప్ ఇబ్బంది పెడుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకోనున్నది. అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ తన ఒకరోజు పర్యటనలో భాగంగా మంగళవారం భారత్ రారనున్నారు. ఈ విషయాన్ని  భారత వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు. లించ్ పర్యటనలో భారత్, అమెరికా మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలిపారు. 

ఈమేరకు రాజేశ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.." ఈ ఏడాది మార్చిలో భారత్, అమెరికా మధ్య బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. చివరిది జూలైలో అమెరికాలో జరిగింది. ఆగస్టు 25 నుంచి 29 మధ్య ఆరో రౌండ్ ఢిల్లీలో జరగాల్సి ఉనప్పటికీ..  ట్రంప్ భారత్‌‌పై విధించిన డబుల్ టారిఫ్‌‌ల వల్ల వాయిదా పడింది. అయితే, ఇప్పుడు జరిగేది మాత్రం ఆరో రౌండ్ చర్చలు కాదు. కేవలం వాణిజ్య సంబంధిత అంశాలపై మాత్రమే సమావేశం జరగనుంది. వాణిజ్యానికి సంబంధంలేని అంశాలు ఈ మీటింగులో చర్చించబోం" అని పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య వారానికోసారి చర్చలు జరుగుతున్నాయని.. లించ్ పర్యటన ప్రతిపాదిత బైలాటరల్ ట్రేడ్ డీల్‌‌కు భవిష్యత్ ప్రణాళికను నిర్ణయిస్తుందని అగర్వాల్ పేర్కొన్నారు.