
- లోకల్ కరెన్సీలో ట్రేడ్ పై చర్చలు
- చాగోస్ ఒప్పందం మారిషస్ సార్వభౌమత్వానికి చారిత్రక విజయమన్న ప్రధాని
- వారణాసిలో మోదీ, మారిషస్ పీఎం నవీన్ చంద్ర భేటీ
వారణాసి: భారత్–మారిషస్ మధ్య గురువారం వారణాసిలో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గూలం ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రెండు దేశాలు కేవలం భాగస్వాములు కాదు.. ఒకే కుటుంబమని, వీటి ఆకాంక్షలు, భవిష్యత్తు ఒకటేనని చెప్పారు.
అలాగే మారిషస్‌కు 655 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఇది మారిషస్‌లో మౌలిక సదుపాయాలు, ఉపాధి, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరుస్తుందన్నారు. మారిషస్‌లో జన్ ఔషధి కేంద్రం, 500 పడకల సర్ సీవూసాగర్ రామ్‌గూలం ఆసుపత్రి, ఆయుష్ సెంటర్, వెటర్నరీ స్కూల్, యానిమల్ హాస్పిటల్నిర్మాణానికి మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు. చాగోస్ మెరైన్ ఏరియా, ఎస్‌ఎస్‌ఆర్ విమానాశ్రయ ఏటీసీ టవర్, హైవే, రింగ్ రోడ్ ప్రాజెక్టులను భారత్ ముందుకు తీసుకెళ్తుందన్నారు.
విద్య, విద్యుత్, హైడ్రోగ్రఫీ, అంతరిక్ష పరిశోధనలలో సహకారాన్ని బలోపేతం చేసుకోనున్నట్టు చెప్పారు.చాగోస్ ఒప్పందం విజయాన్ని మోదీ “మారిషస్ సార్వభౌమత్వానికి చారిత్రక విజయం”గా అభివర్ణించారు. స్థానిక కరెన్సీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు రెండు దేశాలు కలిసి పనిచేస్తాయన్నారు. గతేడాది యూపీఐ, రూపే కార్డులు ప్రవేశపెట్టిన తర్వాత, ఇప్పుడు స్థానిక కరెన్సీ వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఐఐటీ మద్రాస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ మారిషస్ విశ్వవిద్యాలయంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి,
వివేకానంద చికాగో ప్రసంగం..చరిత్రాత్మకం
స్వామి వివేకానంద 1893లో ఇదే రోజున (సెప్టెంబర్ 11) చికాగోలో చేసిన ప్రసంగాన్ని మోదీ గురువారం గుర్తు చేశారు. ఆ ప్రసంగాన్ని షేర్చేస్తూ దానిని భారత చరిత్రలో ప్రేరణాత్మక క్షణంగా అభివర్ణించారు. ‘‘విశ్వ సౌభ్రాతృత్వం, మత సహనాన్ని ప్రబోధించిన ఈ ప్రసంగం హిందూ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. వివేకానందుడు భారతీయ సంస్కృతిని ఉద్ఘాటించారు. సమస్త మానవులు ఒకే గమ్యాన్ని చేరుకుంటారు” అని ఆ ప్రసంగంలో వివేకానంద పేర్కొన్నారని తెలిపారు.
ఉత్తరాఖండ్ లో మోదీ ఏరియల్ సర్వే
ఉత్తరాఖండ్‌లోని విపత్తు ప్రభావిత జిల్లాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేపట్టారు. ఇటీవల వర్షాలు, వరదలు, కొండచరియలతో ఉత్తరకాశీ, చమోలీ, రుద్రప్రయాగ్, పౌరీ, భాగేశ్వర్, నైనిటాల్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తుల్లో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 85 మంది మరణించగా, 128 మంది గాయపడ్డారు, 94 మంది గల్లంతయ్యారు. సర్వే తర్వాత మోదీ జోలీ గ్రాంట్ విమానాశ్రయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.