- ప్రతి ఏటా 7.22 శాతం వృద్ధి
- రూ. 2.63 లక్షల కోట్లకు ఎగుమతులు
- 2030 నాటికి రూ.11 లక్షల కోట్లకు ఫార్మెక్సిల్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎక్కువ నాణ్యత, తక్కువ ధరలు, నమ్మకమైన సరఫరా వ్యవస్థతో మనదేశం ప్రపంచ ఔషధాల కేంద్రంగా నిలిచిందని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) పేర్కొంది. గత 12 ఏళ్లలో ఈ రంగం వ్యూహాత్మకంగా ఎదిగిన తీరు గురించి కేంద్ర పరిశ్రమలశాఖ డిప్యూటీ డైరెక్టర్ రవితేజ హైదరాబాద్‌లోని ఫార్మెక్సిల్ సంస్థ ఆఫీసులో వివరించారు. భారత ఫార్మా రంగం 2030 నాటికి రూ. 11 లక్షల కోట్ల మార్కును అందుకుంటుందని, రూ. 4.25లక్షల కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధిస్తుందని అంచనా. ఎగుమతులు 2015లో రూ. 1.19 లక్షల కోట్ల నుంచి 2026 నాటికి రూ. 2.63 లక్షల కోట్లకు పెరిగాయి.
ఈ కాలంలో 7.22 శాతం వార్షికవృద్ధి నమోదైంది. పరిమాణపరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారత్, అంతర్జాతీయ జనరిక్ మందుల డిమాండ్‌లో 20 శాతాన్ని భర్తీ చేస్తోంది. 200కు పైగా దేశాలకు మందులు ఎగుమతి చేస్తోంది. ఇందులో 60 శాతం ఎగుమతులు అత్యంత కఠినమైన నియంత్రణలు గల అంతర్జాతీయ మార్కెట్లకే వెళ్తున్నాయి.
- వాల్యూమ్ నుంచి వ్యాల్యూ వైపు
భారత ఫార్మా రంగం జనరిక్ మందులకే పరిమితం కాకుండా, అత్యున్నత విలువ కలిగిన వాల్యూమ్ నుంచి వ్యాల్యూ వైపు అడుగులు వేస్తోంది. భవిష్యత్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని బయోసిమిలర్స్, జీన్ థెరపీలు, వ్యాక్సిన్లు, మెడికల్ డివైసెస్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ (ఏపీఐ) స్వయం సమృద్ధిపై దృష్టి సారించింది.
ఇందులో భాగంగా రూ. 10 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన బయోఫార్మా శక్తి (బీఎస్) లాంటి కార్యక్రమాలు రాబోయే ఐదేళ్లలో క్లినికల్ ట్రయల్స్ మౌలిక వసతులను, పరిశోధనలను మరింత బలోపేతం చేయనున్నాయి. దేశంలో పేటెంట్ దరఖాస్తులు రెండింతలు అయ్యాయి. జీసీసీల ద్వారా విదేశీ సంస్థలు మనదేశంలో రూ. 2,550 కోట్ల పెట్టుబడులు పెడుతూ, 30 వేల మందికి పైగా నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నాయని రవితేజ వివరించారు.
- యూఎస్ అతిపెద్ద మార్కెట్
అమెరికా మన ఫార్మాకు అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. అమెరికాకు ఎగుమతుల విలువ దాదాపు రూ. 89,250 కోట్ల నుంచి రూ. 1,27,500 కోట్లకు చేరింది. ఇది గతంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికం. అమెరికా వెలుపల అత్యధికంగా భారత్‌లోనే వెయ్యికిపైగా యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదిత తయారీ కేంద్రాలు ఉన్నాయి.
ఫ్రాన్స్, బ్రెజిల్, యూకే, దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఇటీవల కుదిరిన ఇండియా -యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ వాణిజ్య ఒప్పందం ద్వారా బయోసైన్సెస్, పరిశోధన రంగాల్లో 15 ఏళ్లలో రూ. 8.50 లక్షల కోట్ల పెట్టుబడులకు కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. 2023 నుంచి భారత్ దాదాపు 1500 మెట్రిక్ టన్నుల మందులను 56 దేశాలకు పంపింది.
