
- బరిలోకి పేస్ లీడర్ బుమ్రా
- అయ్యర్‌కు మళ్లీ మొండిచేయిసిరాజ్, రాహుల్‌కు దక్కని చోటు
ముంబై: ప్రతిష్టాత్మక ఆసియా కప్‌కు ఇండియా టీమ్‌ను మంగళవారం ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఊహించినట్లుగానే టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇప్పటి వరకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కేవలం ప్లేయర్‌గా ఉంటాడు. 2024 శ్రీలంకపై చివరిసారి టీ20 మ్యాచ్ ఆడిన గిల్.. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నాలుగు సెంచరీలతో సూపర్ ఫామ్ చూపెట్టాడు. అయితే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కూడా జట్టులోకి రావడంతో గిల్‌ను ఏ స్థానంలో ఆడిస్తారనే సందిగ్ధత మొదలైంది.
‘ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మేం అనుకున్న దానికంటే గిల్ చాలా బాగా ఆడాడు. అందుకే టీ20ల్లోకి తీసుకున్నాం. టాపార్డర్‌లో చాలా ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. దుబాయ్‌కి వెళ్లిన తర్వాత ప్రత్యర్థులను, పరిస్థితులను బట్టి ఫైనల్ ఎలెవన్‌పై నిర్ణయం తీసుకుంటాం’ అని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించాడు. మిడిలార్డర్ బలోపేతం కోసం శాంసన్‌ను కిందకు దించి.. గిల్‌కు ఓపెనింగ్ స్లాట్‌ను కేటాయించే చాన్స్ ఉంది. ‘గిల్, జైస్వాల్ లేని టైమ్‌లో శాంసన్.. అభిషేక్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. అభిషేక్ పెర్ఫామెన్స్‌ను బట్టి అతన్ని లైనప్‌లో కిందకు తీసుకొచ్చే అవకాశం లేదు. బౌలింగ్ కూడా చేసే సత్తా ఉంది. గిల్ ఆడిన చివరి టీ20లోనూ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అది వరల్డ్ కప్ తర్వాత జరిగింది. కాబట్టి అదే లైన్‌లో మేం ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఇక ఫైనల్ ఎలెవన్‌ను ఎలా ఉండాలనేది సూర్య నిర్ణయించుకుంటాడు. టీ20 క్రికెట్ డెప్త్‌ను దృష్టిలో పెట్టుకుని మేం 15 మందిని ఎంపిక చేశాం’ అని అగార్కర్ వివరించాడు.
బుమ్రా వరల్డ్ కప్ తర్వాత..
పేస్ బౌలింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రాను తీసుకొచ్చారు. గతేడాది వరల్డ్ కప్ తర్వాత బుమ్రా ఆడుతున్న తొలి టీ20 టోర్నీ ఇది. అయితే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో బుమ్రా వర్క్ లోడ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్ ముగిసిన వెంటనే అక్టోబర్ 2 నుంచి ఇండియా.. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సిరీస్‌లో బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. విండీస్‌తో సిరీస్ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్‌ను ఆసియా కప్‌కు సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు బ్యాకప్ కీపర్‌గా జితేష్ శర్మను బ్యాకప్ వికెట్ కీపర్‌గా తీసుకున్నారు. ఆల్‌రౌండర్ బాధ్యతలను హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబేలకు కట్టబెట్టారు. మరో నలుగుర్ని స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు.
జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, జితేశ్ శర్మ, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా, తిలక్ వర్మ, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.
స్టాండ్ బై: ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
శ్రేయస్‌కు నో ప్లేస్
ఐపీఎల్‌లో దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్‌ను పక్కనబెట్టడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్‌కు ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చిన ఘనత కూడా ఉంది. అయినా సెలెక్టర్లు అతన్ని తీసుకోకపోవడంపై చాలా విమర్శలు వస్తున్నాయి. కనీసం స్టాండ్‌బై లిస్టులోనూ అయ్యర్‌కు చోటు లేకపోవడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే టెస్టు టీమ్‌కు దూరంగా ఉంచిన టాలెంటెడ్ ప్లేయర్‌ను చాన్నాళ్లుగా టీ20 ఫార్మాట్‌కు సైతం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని అశ్విన్ వంటి మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.