బ్యాంకాక్: ఆసియా అండర్-19 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఇండియాకు మరో ఐదు మెడల్స్ ఖాయం అయ్యాయి. గురువారం జరిగిన మెన్స్ కేటగిరీ క్వార్టర్- ఫైనల్స్‌లో ఐదుగురు బాక్సర్లు విజయం సాధించి సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించారు. దీంతో ఇప్పటికే సెమీస్ చేరిన ఏడుగురు మహిళా బాక్సర్లతో కలిపి టోర్నమెంట్‌లో ఇండియాకు మొత్తం 12 పతకాలు లభించున్నాయి. 55 కేజీ క్వార్టర్ ఫైనల్లో శివమ్ 5–0తో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అబ్దులజీజ్ అబ్దునజరోవ్‌పై గన విజయం సాధించాడు.
ఇతర బౌట్లలో మౌసమ్ సుహాగ్ (65 కేజీ)3–2 తో కిర్గిస్థాన్‌కు చెందిన ముఖమ్మద్ అలింబెకోవ్‌పై పోరాడి గెలిచాడు. రాహుల్ కుందు (75 కేజీ).. యోంజో జియోంగ్ (సౌత్ కొరియా)ను చిత్తు చేయగా, గౌరవ్ (85 కేజీ).. చైనీస్ తైపీకి చెందిన కువాంగ్-యావో చెంగ్‌పై పోరాడి విజయం సాధించాడు. హేమంత్ సంగ్వాన్ (90 కేజీ) ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ముహమ్మద్రిజో సిద్ధిఖోవ్‌పై గెలిచి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. అయితే 90 ప్లస్ కేజీల విభాగంలో బరిలోకి దిగిన క్రిష్ మాత్రం అబ్బాస్ గర్షస్బీ (ఇరాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు.
