సూపర్‌ గా గెలిచారు

సూపర్‌ గా గెలిచారు

గెలవడం సాధారణమే.. కానీ ఆడిన తీరు మాత్రం అసాధారణం..! సూపర్‌‌ ఓవర్‌‌లో ఇండియా టార్గెట్‌‌ 6 బంతుల్లో 18 పరుగులు… రోహిత్‌‌కు, రాహుల్‌‌కు ఇది పెద్ద లెక్క కాకపోవచ్చు..! కానీ, ఎదురుగా సౌథీని చూస్తే ఎక్కడో ఓ మూలన చిన్న సందేహం.. ! దానిని రెట్టింపు చేస్తూ తొలి 4 బంతుల్లో 8 పరుగులే ఇచ్చాడు..! అప్పుడు మొదలైంది.. టెన్షన్‌‌..! వరల్డ్‌‌కప్‌‌ సెమీస్​కు ఏమాత్రం తీసిపోకుండా.. చివరి బాల్‌‌ గాలిలోకి లేచేదాకా.. ప్రతి ఒక్కరిలోనూ ఒకటే ఉత్కంఠ..! నెగ్గాలంటే
2 బాల్స్‌‌లో 10 రన్స్‌‌ కావాలి..! ఇక నెగ్గేదెలా అనుకుంటున్న తరుణంలో… ‘హిట్‌‌మ్యాన్‌‌’ రోహిత్‌‌ సూపర్‌‌ హిట్టయ్యాడు..! ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేలా.. కళ్లు మిరిమిట్లు గొలిపేలా.. ఒకటి మిడ్‌‌వికెట్‌‌, రెండోది లాంగాఫ్‌‌లో… వరుసగా భారీ సిక్సర్లు కొట్టి.. ఇండియాకు ‘సూపర్‌‌’ విజయాన్ని అందించాడు..! ఫలితంగా న్యూజిలాండ్‌‌ గడ్డపై టీమిండియా తొలి టీ20 సిరీస్‌‌ సాధించి రికార్డులకెక్కింది..!!

హామిల్టన్‌‌:

ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించిన మూడో టీ20లో ఇండియా గ్రేట్‌‌ విక్టరీ సాధించింది. రోహిత్‌‌ (40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65), కెప్టెన్‌‌ కింగ్‌‌ కోహ్లీ (27 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 38) దుమ్మురేపడంతో.. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో టీమిండియా సూపర్‌‌ ఓవర్‌‌లో న్యూజిలాండ్‌‌ను ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను మరో రెండు మ్యాచ్‌‌లు మిగిలి ఉండగానే 3–0తో సొంతం చేసుకుంది. తద్వారా కివీస్‌‌ గడ్డపై తొలి టీ20 సిరీస్‌‌ ఖాతాలో వేసుకుంది. టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి179 పరుగులు చేసింది. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో న్యూజిలాండ్‌‌ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 రన్స్‌‌ మాత్రమే చేయడంతో మ్యాచ్‌‌ సూపర్‌‌ ఓవర్‌‌కు వెళ్లింది.  కేన్‌‌ విలియమ్సన్‌‌ (48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 95) కెరీర్‌‌ బెస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేయగా, మార్టిన్‌‌ గప్టిల్‌‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31) విలువైన పరుగులు అందించాడు. రోహిత్‌‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం వెల్లింగ్టన్‌‌లో జరుగుతుంది.

కేన్‌‌ షో.. షమీ సూపర్‌‌ షో

కెప్టెన్‌‌గా, నాణ్యమైన టాప్‌‌ ఆర్డర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా విలియమ్సన్‌‌.. వన్‌‌ మ్యాన్‌‌ షో చూపెట్టాడు. ఈ మ్యాచ్‌‌తో పాటు సూపర్​ఓవర్​లోనూ అన్నీ తానై నడిపించాడు. కానీ మ్యాచ్​ ఆఖరి ఓవర్‌‌లో షమీ (2/32) అద్భుతం ముందు తడబడ్డాడు. విజయానికి చివరి 6 బంతుల్లో 9 రన్స్‌‌ కావాల్సిన దశలో.. షమీ ఫస్ట్‌‌ బాల్‌‌ను టేలర్‌‌ భారీ సిక్సర్‌‌గా మలిచాడు. రెండో బాల్‌‌కు సింగిల్‌‌ రాగా, మూడో బాల్‌‌కు విలియమ్సన్‌‌ను ఔట్‌‌ చేసి మ్యాచ్‌‌ను మలుపు తిప్పాడు. అప్పర్‌‌ కట్‌‌ ఆడబోయిన కేన్‌‌… కీపర్‌‌ రాహుల్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. క్రీజులోకి వచ్చిన సీఫర్ట్‌‌ (0 నాటౌట్‌‌) నాలుగో బాల్‌‌కు రన్‌‌ తీయలేదు. ఐదో బాల్‌‌.. లెగ్‌‌బై కావడంతో స్కోర్లు సమమయ్యాయి. ఇక లాస్ట్‌‌ బాల్‌‌కు ఒక్క రన్‌‌ చేస్తే కివీస్‌‌ గెలిచేది..కానీ షమీ వేసిన స్వింగింగ్‌‌ యార్కర్‌‌కు.. టేలర్‌‌ క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. అంతకుముందు గప్టిల్‌‌, మన్రో (14) తొలి వికెట్‌‌కు 47 రన్స్‌‌ జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. ఠాకూర్‌‌ (2/21) వేసిన ఇన్నింగ్స్‌‌ రెండో బాల్‌‌ను, బుమ్రా మూడో ఓవర్‌‌లో కలిపి గప్టిల్‌‌ మూడు సిక్సర్లు బాదాడు. మన్రో కూడా జోరందుకున్నా.. 6వ ఓవర్‌‌లో గప్టిల్‌‌ను ఔట్‌‌ చేసిన ఠాకూర్‌‌ ఇండియాకు బ్రేక్‌‌ ఇచ్చాడు. విలియమ్సన్‌‌ క్రీజులోకి రాగా జడేజా (1/23) వేసిన నెక్ట్స్‌‌ ఓవర్‌‌లో మన్రో స్టంపౌటవ్వడంతో కివీస్‌‌ నెమ్మదించింది. ఈ దశలో శాంట్నర్‌‌ (9)ను పించ్‌‌ హిట్టర్‌‌గా దింపి కివీస్‌‌ చేసిన ప్రయోగాన్ని11వ ఓవర్‌‌లో చహల్‌‌ (1/36)  విఫలం చేశాడు. కానీ గ్రాండ్‌‌హోమ్‌‌ (5) అండతో  విలియమ్సన్‌‌ రెచ్చిపోయాడు. 28 బంతుల్లోనే హాఫ్‌‌ సెంచరీ దాటేశాడు. దీంతో టార్గెట్‌‌ నెమ్మదిగా కరగడం మొదలైంది. నాలుగో వికెట్‌‌కు ఈ ఇద్దరూ జోడించిన 49 రన్స్‌‌లో విలియమ్సన్‌‌ 44 రన్స్‌‌ చేశాడంటే అతని విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని.. 16వ ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు గ్రాండ్‌‌హోమ్‌‌ను ఔట్‌‌ చేయడం ద్వారా ఠాకూర్‌‌ విడగొట్టాడు. దీంతో కివీస్‌‌ టార్గెట్‌‌ 24 బంతుల్లో 43 రన్స్‌‌గా మారింది. రాస్‌‌ టేలర్‌‌ (17) నిలకడగా ఆడినా.. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్‌‌లో హ్యాట్రిక్‌‌ బౌండరీలు సహా 14 రన్స్‌‌ రాబట్టిన విలియమ్సన్‌‌ ఇండియాపై ఒత్తిడి పెంచేశాడు. 18వ ఓవర్‌‌లో చహల్‌‌ తొమ్మిది రన్స్‌‌ ఇవ్వగా, 19వ ఓవర్‌‌లో బుమ్రా11 రన్స్‌‌ ఇవ్వడంతో కివీస్‌‌ టార్గెట్‌‌ 6 బాల్స్‌‌ 9 రన్స్‌‌గా మారింది.

ఫామ్‌‌లోకొచ్చాడు..

తొలి రెండు మ్యాచ్‌‌ల్లో విఫలమైన రోహిత్‌‌ ఎట్టకేలకు ఫామ్‌‌లోకి వచ్చాడు. రాహుల్‌‌ (19 బంతుల్లో 27)తో కలిసి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ఫస్ట్‌‌ వికెట్‌‌కు 48 బాల్స్‌‌లో 89 రన్స్‌‌ జోడించి  భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఎదుర్కొన్న మూడో బాల్‌‌ను బౌండరీకి తరలించి ఖాతా తెరచిన రోహిత్‌‌.. బెనెట్‌‌ వేసిన పవర్‌‌ ప్లే లాస్ట్‌‌ ఓవర్‌‌లో 27 రన్స్‌‌ రాబట్టాడు. ఇందులో రాహుల్‌‌ ఓ రన్‌‌ చేయగా, రోహిత్‌‌ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదేశాడు. దీంతో హిట్‌‌మ్యాన్‌‌ 23 బంతుల్లోనే హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తొమ్మిదో ఓవర్‌‌లో రాహుల్‌‌ ఔట్‌‌కావడంతో కివీస్‌‌కు ఉపశమనం లభించింది. వన్‌‌డౌన్‌‌లో శివమ్‌‌ దూబే (3)ను పంపి కోహ్లీ చేసిన ప్రయోగం ఫలించలేదు. 11వ ఓవర్‌‌లో బెనెట్‌‌.. మూడు బంతుల తేడాలో రోహిత్‌‌, దూబేను పెవిలియన్‌‌కు పంపడంతో ఇన్నింగ్స్‌‌ తడబడింది. కోహ్లీ, అయ్యర్‌‌(17) క్రీజులో ఉన్నా.. భారీ షాట్లు లేకపోవడంతో స్కోరు వేగం తగ్గింది.  సింగిల్స్‌‌, డబుల్స్‌‌తో పాటు చెత్త బాల్స్‌‌ను బౌండరీకి తరలిస్తున్న ఈ జోడీని శాంట్నర్‌‌ విడదీశాడు.17వ ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు అయ్యర్‌‌ స్టంపౌట్‌‌కాగా, 18వ ఓవర్లో ఇండియా150 రన్స్‌‌ మార్కు దాటింది. కానీ బెనెట్‌‌ వేసిన19వ ఓవర్‌‌లో సౌథీకి క్యాచ్‌‌ ఇచ్చి కోహ్లీ వెనుదిరిగాడు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో పాండే (14 నాటౌట్‌‌), జడేజా(10 నాటౌట్‌‌) కలిసి 18 రన్స్‌‌ చేయడంతో విరాట్‌‌సేన ప్రత్యర్థి ముందు ఓ మంచి టార్గెట్‌‌ ఉంచగలిగింది.

ముందే బ్యాగ్‌‌ సర్దేశా!

సూపర్‌‌ ఓవర్‌‌ను అసలు ఊహించలేదు. నా బ్యాగ్‌‌ కూడా ప్యాక్‌‌ చేసేసుకున్నా. మళ్లీ బ్యాటింగ్‌‌కు రావాలనే సరికి ఎబ్డామిన్‌‌ గార్డ్‌‌ ఎక్కడుందో వెతకడానికి ఐదు నిమిషాలు పట్టింది. కివీస్‌‌ బ్యాటింగ్‌‌ చూసి సింపుల్‌‌గా గెలుస్తారనుకున్నా. సూపర్‌‌ ఓవర్‌‌ కోసం స్పెషల్‌‌ ట్రైనింగ్‌‌ ఉండదు. బ్యాట్స్‌‌మన్‌‌ విషయంలో ఆ రోజు ఎవరు టచ్‌‌లో ఉన్నారో వాళ్లకే చాన్స్‌‌ దొరుకుతుంది. ఈ రోజు నేను బాగా ఆడి ఉండకపోతే అయ్యర్‌‌కు ఆ చాన్స్‌‌ దొరికేది. బౌలర్‌‌ ఎంపిక విషయంలో షమీయా, జడేజానా అనే  చిన్న చర్చ జరిగింది. కానీ యార్కర్లు, స్లో బాల్స్‌‌ నిలకడగా వేయగల బుమ్రాకే బాధ్యత అప్పగించాం. నిజానికి నేను కొట్టిన రెండు సిక్సర్ల కంటే షమీ వేసిన లాస్ట్‌‌ ఓవర్‌‌ వల్లే మేము గెలిచాం.        – రోహిత్‌‌

టీ20ల్లో అత్యధిక రన్స్‌‌ చేసిన ఇండియన్‌‌ కెప్టెన్‌‌గా
కోహ్లీ (1126) రికార్డులకెక్కాడు. ధోనీ (1112) రెండో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌‌గా డుప్లెసిస్‌‌ (1273) టాప్‌‌లో ఉన్నాడు.