- యూఏఈ ప్రొడక్షన్ మిలియన్ బీపీడీ పెరిగే అవకాశం
- పెరిగిన ఆయిల్ మనకే!
- సౌదీ, యూఏఈ, ఒమాన్ నుంచి పెరిగిన దిగుమతులు
- ఇరాక్, ఖతార్, కువైట్ నుంచి ఆగిపోయిన సప్లయ్
న్యూఢిల్లీ: గత 60 ఏళ్లుగా కొనసాగిన ఒపెక్ అలయన్స్ నుంచి యూఏఈ బయటకొచ్చేసింది. ఇది ఇండియాకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఒపెక్, ఒపెక్ ప్లస్ కోటా పాటించకుండా యూఏఈ తన ప్రొడక్షన్‌ను పెంచగలుగుతుంది. దీంతో మనకు సప్లయ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ మిడిల్ ఈస్ట్ దేశం నుంచి ఇండియాకు 6.19 లక్షల బ్యారెల్స్ పెర్ డే (బీపీడీ) రాగా, కిందటేడాది ఏప్రిల్‌లో 4.33 లక్షల బీపీడీ దిగుమతయ్యింది.
హార్మూజ్ జల సంధితో సంబంధం లేకుండా పైప్‌లైన్స్ ద్వారా సౌత్‌లోని ఫుజైరా పోర్ట్‌కు, అక్కడి నుంచి డైరెక్ట్‌గా అరేబియా సముద్రం ద్వారా ఇండియాకు ఆయిల్ సప్లయ్ అవుతోంది. ఒపెక్ దేశాలు గత కొన్నేళ్లుగా ఆయిల్ ప్రొడక్షన్‌పై కోటా కొనసాగిస్తున్నాయి. దీంతో యూఏఈ 3.4 మిలియన్ బీపీడీ ఉత్పత్తి చేస్తుండగా, పూర్తి సామర్ధ్యం మాత్రం 5 మిలియన్ బీపీడీ దగ్గర ఉంది. వచ్చే నెల నుంచి ఒపెక్ కోటాను పాటించాల్సిన అవసరం లేకపోవడంతో యూఏఈ మరో 1 మిలియన్ బీపీడీ ప్రొడక్షన్‌ను వెంటనే పెంచొచ్చు. ఈ పెరిగిన ఆయిల్ ఇండియాకు వస్తుందని అంచనా.
- హార్మూజ్‌తో సంబంధం లేకుండా..
హార్మూజ్ జల సంధితో సంబంధం లేకుండా ఇండియాకు ఆయిల్ సప్లయ్ పెరగనుంది. అబుదాబి ఆయిల్ ఫీల్డ్స్ నుంచి పైప్‌లైన్ ద్వారా సౌత్‌లో ఉన్న ఫుజైరా పోర్ట్‌కు మొదట ఆయిల్ సప్లయ్ కానుంది. 2012లో మొదలైన ఈ ఫుజైరా పైప్‌లైన్ (అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్–ఏడీసీఓపీ) సుమారు 400 కి.మీలు విస్తరించింది. దీంతో పూర్తిగా హార్మూజ్ జలసంధిని బైపాస్ చేయొచ్చు. గతంలో నార్త్‌లో ఉన్న పోర్ట్‌ల ద్వారా యూఏఈ ఆయిల్ సప్లయ్ చేసేది. ఈ పోర్ట్ నుంచి షిప్‌లు హార్మూజ్ ద్వారా ట్రావెల్ అయ్యేవి. ఇరాన్ జలసంధిని మూసేయడంతో ప్రస్తుతం ఫుజైరా పోర్ట్ యూఏఈకి కీలకంగా మారింది.
- ఇండియాకు నిలకడగా సప్లయ్..
ఇండియా, యూఏఈ మధ్య 2022లో ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. బైలేటరల్ ట్రేడ్‌ను 200 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఇండియా దిగుమతి చేసుకుంటున్న ఆయిల్‌లో యూఏఈ వాటా 9–10 శాతం ఉంటుంది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ను కూడా మనం భారీగా కొనుగోలు చేస్తున్నాం. తాజాగా యూఏఈ నుంచి 3 బిలియన్ డాలర్లు ఎల్‌ఎన్‌జీ కొనేందుకు ఇండియన్ కంపెనీలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి కూడా.
దీంతో మనకు నిలకడగా ఆయిల్ సప్లయ్ జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీంతోపాటు యూఏఈ ఆయిల్ ఫీల్డ్ లోవర్ జాకుమ్ ఆఫ్‌షోర్‌లో ఓఎన్‌జీసీ విదేశ్, బీపీసీఎల్, ఐఓసీ కన్సార్టియంకు 10 శాతం వాటా ఉంది. ఇక్కడ రోజుకి 4 లక్షల బీపీడీ ఆయిల్ ఉత్పత్తి అవుతోంది. మరోవైపు ఆన్‌షోర్ బ్లాక్ 1(అబుదాబి)లో ఐఓసీ, బీపీసీఎల్ జాయింట్ వెంచర్ (ఉర్జా భారత్ పీటీఈ లిమిటెడ్) కు 100 శాతం ఎక్స్‌ప్లొరేషన్ హక్కులు ఉన్నాయి. 6,162 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటికే రెండు ఆయిల్ ఫీల్డ్‌లను ఇండియన్ కంపెనీలు గుర్తించాయి.
- ఎర్ర సముద్రం నుంచి సౌదీ
అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్ సౌదీ అరేబియా కూడా హార్మూజ్‌ను బైపాస్ చేసి ఎర్ర సముద్రం గుండా ఇండియాకు ఆయిల్ పంపుతోంది. ఈ దేశం ఇప్పటికే తూర్పు–పడమరను కలిపే పైప్‌లైన్‌ను నిర్మించింది. దీని ద్వారా తూర్పు ప్రాంతాల్లోని ఆయిల్‌ఫీల్డ్‌ల నుంచి ఆయిల్‌ను ఎర్ర సముద్రంలోని యాన్బూ పోర్ట్‌కు సప్లయ్ అవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడి నుంచి 8 లక్షల బీపీడీని సప్లయ్ చేసిన సౌదీ, ఏప్రిల్ మొదటి వారంలో 4.2 మిలియన్ బీపీడీ సప్లయ్ చేసింది.
హార్మూజ్ మూతపడిన తర్వాత సౌదీకి ఈ పైప్‌లైన్ కీలకంగా మారింది. ఇండియాకు ఏప్రిల్‌లో సౌదీ అరేబియా నుంచి 6.97 లక్షల బీపీడీ ఆయిల్ వచ్చింది. మరోవైపు మిడిల్ ఈస్ట్‌లో సౌత్‌లో ఉన్న ఒమాన్ నుంచి కూడా మనకు ఆయిల్ సప్లయ్ పెరిగింది. ఏప్రిల్‌లో లక్ష బీపీడీ సరఫరా జరిగింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమాన్ హార్మూజ్‌ను బైపాస్ చేస్తుండగా, పూర్తిగా ఈ జలసంధిపై ఆధారపడే ఇరాక్, కువైట్, ఖతార్ మాత్రం ఇబ్బందిపడుతున్నాయి. ఈ దేశాల నుంచి ఇండియాకు ఆయిల్ సప్లయ్ ఏప్రిల్‌లో ఆగిపోయింది.

