- కింగ్ చార్లెస్ ది కూడా ఇదే అభిప్రాయమని వెల్లడి
వాషింగ్టన్: ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా ఎప్పటికీ మారనివ్వబోమని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విషయంలో బ్రిటన్ కింగ్ చార్లెస్ కూడా తనతో అంగీకరించారని పేర్కొన్నారు. ఇరాన్‌ను సైనికంగా ఓడించామని, అణ్వాయుధాలు కలిగి ఉండటానికి ఎన్నటికీ అనుమతించబోమని చెప్పారు.
అమెరికా 250వ ఇండిపెండెన్స్ వేడుకల సందర్భంగా బ్రిటన్ కింగ్ చార్లెస్, క్వీన్ కమిల్లా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారిక విందు కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక ఆపరేషన్‌కు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మద్దతు ఇవ్వలేదని ట్రంప్ విమర్శించారు. ఈ కామెంట్లు బ్రిటిష్ రాజకుటుంబాన్ని వివాదంలోకి లాగే ప్రమాదం ఉండడంతో బుధవారం ఉదయం బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రతినిధి స్పందించారు.
అణ్వాయుధ వ్యాప్తి నిరోధంపై తన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి కింగ్ చార్లెస్ కట్టుబడి ఉన్నారని ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో.. ‘రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సహాయం లేకుంటే యూరోపియన్లు జర్మన్ మాట్లాడేవారు’ అని ట్రంప్ కామెంట్ చేయగా.. ‘‘అధ్యక్షా, బ్రిటిష్‌వారు లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడాల్సి వచ్చేది’ అని కింగ్ చార్లెస్ కౌంటర్ ఇచ్చారు. దీంతో హాల్ అంతా నవ్వులు విరిసాయి.

