
- టెక్స్‌టైల్ ఇండస్ట్రీకి ఊరట కల్పించిన కేంద్రం
- సెప్టెంబర్ 30 వరకు అమలు చేస్తామని ప్రకటన
న్యూఢిల్లీ: అమెరికా విధించిన టారిఫ్‌ల నుంచి కాటన్ పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం కొంత ఊరట కల్పించింది. పత్తి దిగుమతిపై ఉన్న 11 శాతం సుంకాలను సెప్టెంబర్ 30 వరకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో టెక్స్‌టైల్ పరిశ్రమలకు కొంత రిలీఫ్ దొరికినట్టయింది. ఈ టెంపరరీ సస్పెన్షన్ అనేది ఆగస్టు 19 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్రం ప్రకటించింది.
సెప్టెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి వరకు పత్తి దిగుమతులపై ఇక ఎలాంటి సుంకాలు ఉండవు. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. ఇప్పటి దాకా కాటన్ ఇంపోర్ట్‌పై 5% బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో పాటు 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(ఏఐడీసీ) సహా మొత్తం 11 శాతం పన్ను ఉండేది.
కాగా, దిగుమతి సుంకం నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (సీఐటీఐ) కేంద్ర ప్రభుత్వానికి విన్నవించగా.. సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నది. కాగా, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు గాను ఇండియాపై ట్రంప్ 50% టారిఫ్ విధించారు. ఇప్పటికే 25% టారిఫ్ అమల్లోకి వచ్చింది.
మిగిలిన 25% టారిఫ్ వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం.. టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధికి కీలకంగా మారింది. పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం టెక్స్‌టైల్ స్టాక్స్ అన్నీ 8% వరకు పెరిగాయి. అయితే, ఈ మినహాయింపు తాత్కాలికమేనని, సెప్టెంబర్ 30 తర్వాత సుంకాలు మళ్లీ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.