- ఇండియా కూటమి ఫ్లాష్ ప్రొటెస్ట్
- జంతర్‌మంతర్‌కు వెళ్తుండగా పోలీసుల అడ్డగింత
- రోడ్డుపై పడుకుని ప్రియాంక, రాహుల్ నిరసన
- ఎత్తుకెళ్లి బస్సు ఎక్కించిన పోలీసులు
- రాహుల్ ఉన్న బస్సు టైర్ పంక్చర్ చేసిన కార్యకర్తలు
- వేరే బస్సులోకి ఎక్కించి తరలించిన పోలీసులు
- బారాఖంబా ఠాణాకు తరలింపు.. విడుదల
- నన్ను ఈడ్చుకెళ్లి నేలపై పడేశారు..
- ఒళ్లంతా గీరుకుపోయింది: ప్రియాంక
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వరుసగా రెండో రోజూ ప్రతిపక్షాల నిరసనలతో హోరెత్తింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ)ని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో మంగళవారం ఎనిమిది గంటలపాటు బైఠాయించిన ప్రతిపక్ష నేతలు.. బుధవారం కూడా అకస్మాత్తుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు బయలుదేరారు. దీంతో ముందస్తు అనుమతి లేదంటూ జంతర్ మంతర్‌కు కిలోమీటర్ దూరంలోనే వారిని పోలీసులు అడ్డగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రెస్టారెంట్ టు జంతర్ మంతర్
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీతోసహా ఇండియా కూటమి పార్టీల ఎంపీలు ముందుగా జనపథ్‌లోని సాగర్ రత్న రెస్టారెంట్‌లో లంచ్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్‌తోపాటు తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్‌జేడీ, ఐయూఎంఎల్ తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఇందులో పాల్గొన్నారు. లంచ్ తర్వాత జంతర్ మంతర్‌కు వెళ్లి బైఠాయించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుని ఆయా పార్టీల నేతలంతా బస్సుల్లో బయలుదేరారు. జనపథ్ నుంచి జంతర్‌మంతర్ వైపు బస్సులు నెమ్మదిగా కదులుతుండగా, కాంగ్రెస్ ఎంపీలు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, దీపేందర్ సింగ్ హుడా, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, ఇమ్రాన్ మసూద్‌తో పాటు సేవాదళ్ చీఫ్ బీవీ శ్రీనివాస్ త్రివర్ణ పతాకాలు చేబూని బస్సులపై నిలుచున్నారు. ప్రతిపక్ష నేతలను అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. నిరసన ప్రాంతానికి కిలోమీటరు దూరంలో, షాంగ్రి-లా హోటల్ సమీపంలో అశోకా రోడ్డు వద్ద అంచలంచెలుగా భద్రతా వలయం ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బంది.. అక్కడే ప్రతిపక్షాల బస్సులను అడ్డుకున్నారు. దీంతో విండ్సార్ సర్కిల్ వద్ద రోడ్డు ప్రతిపక్షాల నినాదాలతో హోరెత్తింది.ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకోవడంతో అత్యంత భద్రత ఉండే ఆ ప్రాంతంలో రెండో రోజు కూడా హైటె న్షన్ వాతావరణం కనిపించింది.
రాహుల్ బస్సు టైరు పంక్చర్
జంతర్ మంతర్ వద్ద ధర్నాకు ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ ఇండియా కూటమి కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్‌మంతర్ వద్ద ఏ నిరసన తెలపాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరని తెలిపారు. నిరసనకారులను బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించి తరలించారు. రాహుల్‌ను ఎక్కించిన బస్సు టైరుకు కాంగ్రెస్ కార్యకర్తలు పంక్చర్ చేశారు. దీంతో రాహుల్‌ను మరో బస్సులోకి మార్చి బారాఖంబా రోడ్డులోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తొలుత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను ఒక బస్సులో కూర్చోబెట్టారు. మిగతావారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లగా, ఇండియా కూటమి నేతలు బస్సు దిగి వచ్చి రోడ్డుపై బైఠాయించారు.
పోలీసులు మొదట రాహుల్ గాంధీని బలవంతంగా భుజాలపై ఎత్తుకుని మోసుకుంటూ వెళ్లి మినీ బస్సు ఎక్కించారు. అమరీందర్ సింగ్ రాజా వారింగ్, ఉదయ్ భాను చిబ్ తదితర కాంగ్రెస్ నేతలు రాహుల్ ఉన్న బస్సు ఎక్కగా, మరో నేత ముంతాజ్ పటేల్ ఆ బస్సు బానెట్‌పై కూర్చున్నారు. ఆ తర్వాత భారీ సంఖ్యలో మహిళా పోలీసు సిబ్బంది రంగప్రవేశం చేసి, రోడ్డుపై పడుకుని ఉన్న ప్రియాంక గాంధీతోపాటు ఇతర మహిళా నేతలను అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. వారిని కూడా బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించి నిరసన ప్రాంతం నుంచి తరలించారు. కొద్ది గంటల తర్వాత రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, ఏఏ రహీమ్, శివదాసన్ తదితర నేతలను కూడా పోలీసులు రిలీజ్ చేశారు. పోలీసులతో ఘర్షణకు ముందు రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నేడు మేం నిరసనల కోసం కేటాయించిన అధికారిక స్థలమైన జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలపబోతున్నాం. మా దృష్టిలో జ్ఞానేశ్ కుమార్ చట్టబద్ధమైన ఎన్నికల కమిషనర్ కాదనే విషయాన్ని దేశానికి తెలియజేస్తాం”అని చెప్పారు.
ప్రతిపక్షాలన్నీ ఐక్యంగానే ఉన్నయ్: కాంగ్రెస్
లంచ్ మీటింగ్ తర్వాత జంతర్ మంతర్‌కు చేపట్టిన మార్చ్‌లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్‌జేడీ, ఐయూఎంఎల్ తదితర పార్టీల ఎంపీలు పాల్గొనగా, సమాజ్‌వాదీ పార్టీ, ఇతర పలు పార్టీల ఎంపీలు గైర్హాజరయ్యారు. దీనిపై మీడియాలో వచ్చిన కథనాలపై కాంగ్రెస్ స్పందిస్తూ, విందు సమావేశంలోనే నిరసన ప్రణాళికను ఖరారు చేశామని తెలిపింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న ఈ పోరాటంలో ప్రతిపక్ష ఎంపీలందరం ఐక్యంగా ఉన్నామని, ప్రజల హక్కులను ఏ విధంగా హరిస్తున్నారో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతూ గళం వినిపిస్తామని చెప్పారు. ఇదే విషయంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలను లంచ్‌కు ఆహ్వానించామని చెప్పారు. అయితే, మంగళవారం రాత్రి ఆలస్యంగా విందు నిర్ణయం తీసుకుని సమాచారం అందించామన్నారు. అందువల్ల కొన్ని పార్టీలు హాజరుకాకపోవడం సహజమేనని, మీడియాలోని కొన్ని వర్గాలు దీనిపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
ఎంపీలపై దాడులు చేస్తారా?
ఎన్నికల కమిషనర్‌ను కలవాలని మాత్రమే కోరుతున్నం. ఎంపీల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా..? దాడులు చేస్తారా..? పోలీసులు నా ఒళ్లంతా గీరుకుపోయేలా చేశారు. మమ్మల్ని నేలపై పడేశారు. ఇప్పుడు మేం ఇక్కడి నుంచి కదలం. ఎంత మంది పోలీసులొస్తారో రానీయండి. నేను మాత్రం ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలను.
- నిరసన కార్యక్రమంలో ప్రియాంకగాంధీ
