సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌పై ఇండియా కూటమి అభిశంసన!

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌పై ఇండియా కూటమి అభిశంసన!
  • జ్ఞానేశ్వర్ ​కుమార్‌‌‌‌పై ప్రవేశపెట్టేందుకు ఇండియా కూటమి యోచన
  • రాహుల్ గాంధీకి అల్టిమేటం నేపథ్యంలో నిర్ణయం!

 న్యూఢిల్లీ: ఓట్ల చోరీ నేపథ్యంలో చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ ​కుమార్‌‌‌‌పై అభిశంసనకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు తీర్మానం తీసుకువచ్చేందుకు ఇండియా కూటమి సభ్యులు సమాలోచన చేస్తున్నట్టు  సంబంధిత వర్గాలు  వెల్లడించాయి. దీనిపై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్‌‌ ప్రతాప్‌‌ గఢీ మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్ర, కర్నాటక, హర్యానా రాష్ట్రాల్లో ఓట్ల​ చోరీ జరిగిందని లోక్‌‌సభ ప్రతిపక్షనేత రాహుల్ ​గాంధీ ఆరోపిస్తూ వస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ ఓటర్ల తొలగింపు చేపట్టిందని చెప్పారు. అయితే, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని.. ఇందుకు సంబంధించిన ఎవిడెన్స్‌‌ను సమర్పించడంతో పాటు అఫిడవిట్​ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ రాహుల్​గాంధీని కోరింది. లేదంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు ప్రజలకు సారీ చెప్పాలని, ఇందుకు వారం రోజుల గడువు ఇస్తూ అల్టిమేటం జారీ చేసింది.

ఈసీ, రాహుల్​ మధ్య మాటల యుద్ధం

ఓట్ల చోరీపై రాహుల్​ గాంధీ ఆరోపణలు, పోరాటం నేపథ్యంలో సీఈసీ  జ్ఞానేశ్‌‌కుమార్‌‌ ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్‌‌ సింగ్‌‌ సంధు, వివేక్‌‌ జోషితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాహుల్​ ఆరోపణలపై సీరియస్​ అయ్యారు. మరోవైపు, రాహుల్​గాంధీ కూడా సీఈసీ వ్యాఖ్యలపై ఫైర్​అయ్యారు. ఈసీ వ్యక్తిగతంగా టార్గెట్​ చేస్తున్నదని ఆరోపించారు. ‘‘ఎన్నికల కమిషన్ నా నుంచి అఫిడవిట్ కోరుతున్నది. కానీ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కూడా నేను చెబుతున్నదే చెప్పినా..  అతడినుంచి అఫిడవిట్ అడగడంలేదు” అని అన్నారు. 

మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలి

 సీఈసీ తొలగింపు ప్రక్రియను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారు. ఆర్టికల్ 324(5) ద్వారా సీఈసీని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సీఈసీని సుప్రీంకోర్టు న్యాయమూర్తిలాగా తొలగించవచ్చు. అయితే, దీన్ని పార్లమెంటు అభిశంసన తీర్మానం ద్వారా తొలగించాల్సి ఉంటుంది. కానీ.. ఈ ప్రక్రియ అత్యంత కఠినమైనది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడటం ఈ విధానం ఉద్దేశం. అభిశంసన తీర్మానం కోసం పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలి.