
- ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి
- ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల భేటీ తర్వాత ప్రకటించిన ఖర్గే
- ఏకగ్రీవంగా నామినేట్ చేసిన అపొజిషన్ పార్టీలు
- ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రతిపక్ష నేతల స్వాగతం
- ఈ ఎన్నిక ఒక సైద్ధాంతిక పోరాటం: ఖర్గే
- ప్రతిపక్షాలు ఏకమవడం ప్రజాస్వామ్య విజయమని కామెంట్
- ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు
- వచ్చేనెల 9న పోలింగ్.. అదేరోజు ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ, వెలుగు: ఉప రాష్ట్రపతి ఎన్నికలో తెలంగాణ బిడ్డ, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగారు. ప్రతిపక్ష పార్టీలు ఆయనను తమ అభ్యర్థిగా ఏకగ్రీవంగా నామినేట్ చేశాయి. మంగళవారం ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీల మీటింగ్ అనంతరం తమ అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని పోటీకి నిలబెడుతున్నట్టు కాంగ్రెస్ చీఫ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. మంగళవారం ఉదయం ఢిల్లీ రాజాజీ మార్గ్ లోని ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల నేతలు సమావేశమై చర్చించారు. అనంతరం కూటమి తరఫున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు ఖర్గే వెల్లడించారు.
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గురువారం(ఈ నెల 21న) నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు. కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికలో నామినేషన్లకు ఈ నెల 21 చివరి తేదీ. 22న స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 25 వరకు గడువు ఉంది. ఎన్నికకు పోలింగ్ వచ్చే నెల 9న జరగనుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. అధికార ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా తమిళనాడు నేత, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను ఇదివరకే ప్రకటించింది.
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆప్ మద్దతు
ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి ఆమ్ ఆద్మీ పార్టీ(ప్రస్తుతం ఇండియా కూటమి నుంచి వైదొలిగింది) కూడా మద్దతు తెలిపినట్టు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ప్రకటించారు. మంగళవారం ఖర్గే నివాసంలో జరిగిన సమావేశానికి ఎన్ సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్, శివసేన యూబీటీ ఎంపీలు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, సీపీఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ, పార్టీ ఎంపీ జాన్ బ్రిట్టాస్, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, డీఎంకే ఎంపీలు కనిమొళి, తిరుచ్చి శివ, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, తదితరులు హాజరయ్యారు. బుధవారం మధ్యాహ్నం పార్లమెంట్ పాత భవనం (సంవిధాన్ సదన్)లోని సెంట్రల్ హాల్ లో ప్రతిపక్ష పార్టీల సభ్యులు మరోసారి భేటీ కానున్నారు.
ప్రతిపక్షాల వ్యూహాత్మక అడుగు..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార పక్షానికి ఎదురు నిలిచిన ప్రతిపక్షాలు తమ అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేశాయి. పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల పేర్లను పరిశీలించాయి. అయితే, ఉప రాష్ట్రపతితో పాటు రాజ్యసభ చైర్మన్ గా కూడా వ్యవహరించే ఈ పదవి కోసం న్యాయశాస్త్రంపై పట్టు, సుదీర్ఘ అనుభవం కలిగిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైపే అన్ని పార్టీల నేతలు మొగ్గు చూపారు. అలాగే ఇప్పటికే అధికార ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన నేత, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరును ప్రకటించినందున.. తమ అభ్యర్థిని కూడా దక్షిణాది నుంచే ఎంపిక చేసి వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. దీంతో న్యాయకోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రాజకీయ నేత సీపీ రాధాకృష్ణన్ మధ్య పోటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంతో పేరు, ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తిని బరిలోకి దించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చినట్టుగా కూడా అయింది. అలాగే ఉప రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఎన్డీఏ చేసిన ప్రయత్నాలకూ చెక్ పెట్టినట్టయింది.
ఈ ఎన్నిక సైద్ధాంతిక పోరాటం: ఖర్గే
దేశంలోని అత్యంత విశిష్టమైన, ప్రగతిశీల న్యాయనిపుణులలో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఒకరని ఏఐసీసీ చీఫ్ ఖర్గే అన్నారు. న్యాయవ్యవస్థల్లో వివిధ హోదాల్లో సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించారని కొనియాడారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడని ప్రశంసించారు. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించిన తర్వాత ఖర్గే మాట్లాడారు. ‘‘ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీ ఒక సైద్ధాంతిక పోరాటం. దేశ స్వాతంత్ర్య ఉద్యమం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు ఆయన ప్రతిబింబంలా నిలిచారు. అందుకే ప్రతిపక్ష పార్టీలు ఆయనను తమ ఉమ్మడి అభ్యర్థిగా నామినేట్ చేశాయి” అని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలపై దాడి జరుగుతోందని, అందుకే ఈ ఎన్నికల్లో పోరాటానికి ప్రతిపక్ష పార్టీలన్నీ సమష్టిగా, దృఢ సంకల్పంతో కలిసిరావాలని ఖర్గే పిలుపునిచ్చారు. ‘‘ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం ప్రజాస్వామ్యానికి గొప్ప విజయం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి జరిగినప్పుడు, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోరాడాలి. అందుకే ఓ మంచి అభ్యర్థిని నిలబెట్టి ఐక్యంగా పోరాడాలని మేం నిర్ణయించాం” అని ఆయన వెల్లడించారు.
సంతోషంగా ఉంది: జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఇండియా కూటమి నేతలు ఏకగ్రీవంగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో పాటు కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్ష పార్టీల తరఫున తాను బరిలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి గొప్ప హోదా కోసం బరిలో ఉంటానని ఏ రోజూ ఊహించలేదని చెప్పారు. అయితే ప్రతిపక్ష కూటమి నుంచి పోటీలో నిలబడుతున్నప్పటికీ, పార్లమెంట్ సభ్యులందరినీ కలిసి తనకు ఓటు వేయాలని కోరతానన్నారు.
కులగణన సర్వే నిపుణుల కమిటీ చైర్మన్‌గా..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే-2024 (ఎస్ఈఈఈపీసీ) డేటా విశ్లేషణ కోసం 11 మంది సభ్యులతో కూడిన స్వతంత్ర నిపుణుల వర్కింగ్ కమిటీ ని వేసింది. ఈ ఎక్స్ పర్ట్ కమిటీకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరించారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేయడానికి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టే ఆధారంగా మారింది. అంతలా సామాజిక న్యాయంపై విస్తృత అవగాహన కలిగిన వ్యక్తిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు పొందారు.
రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా..
- జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి అసలు పేరు బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి
- రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంలో సాధారణ రైతు కుటుంబంలో జులై 8, 1946న జననం
- 1971లో ఓయూ నుంచి లా డిగ్రీ.ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్ రోల్
- 1988 ఆగస్టు 8న ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియామకం
- 1990 వరకు కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు
- 1993లో ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక
- ఉమ్మడి ఏపీ హైకోర్టులో 1993 మే 2న జడ్జిగా నియామకం
- 2005, డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి
- 2007 జనవరి 12న సుప్రీంకోర్టు జడ్జిగా నియామకం. జులై 7, 2011న పదవీ విరమణ
- 2013, మార్చిలో గోవాకు మొదటి లోకాయుక్తగా నియామకం. ఏడు నెలలకే రాజీనామా
- ప్రస్తుతం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌లో సభ్యుడు