కరోనా వ్యాక్సిన్​ కొనుట్ల మనమే టాప్​

కరోనా వ్యాక్సిన్​ కొనుట్ల మనమే టాప్​
  • 160 కోట్ల డోసులు ముందస్తుగా బుకింగ్
  • తర్వాతి స్థానంలో యురోపియన్ యూనియన్, అమెరికా
  • అమెరికాలోని డ్యూక్ వర్సిటీ రిపోర్టులో వెల్లడి

ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసే దేశంగా ఇండియా నిలిచిందని అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీ గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ సెంటర్ తెలిపింది. 160 కోట్ల డోస్ ల వ్యాక్సిన్ ను ముందస్తుగా బుకింగ్ చేసినట్టు వెల్లడించింది.

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లకు మన దేశం భారీగా ఆర్డర్​ పెట్టిందట. దేశంలో హెర్డ్​ ఇమ్యూనిటీ డెవలప్​ అయ్యేందుకు సరిపడా డోసులను కొనేసిందట. అమెరికా డ్యూక్ యూనివర్సిటీ గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ సెంటర్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే మన దేశంలో తయారవుతున్న దేశీ కరోనా టీకాలతో పాటు విదేశాలకు చెందిన కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లనూ ఇండియా కొనేసిందని తెలిపింది. 50 కోట్ల డోస్ ల ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రజెనికా వ్యాక్సిన్, నోవావ్యాక్స్ వంద కోట్ల డోసులు, రష్యా నుంచి 10 కోట్ల డోస్ ల స్పుత్నిక్​ V వ్యాక్సిన్లను ఇండియా  కొనుగోలు చేసినట్టు డ్యూక్ వర్సిటీ తెలిపింది. నవంబర్ 30 నాటికి మొత్తం 160 కోట్ల  డోస్ ల మూడు వ్యాక్సిన్లను కొనుగోలు చేసినట్టు ‘ద లాంచ్ అండ్ స్పీడోమీటర్’ అనాలసిస్ లో వెల్లడించింది. 158 కోట్ల డోసుల వ్యాక్సిన్ కొనుగోలుతో తర్వాతి స్థానంలో యూరోపియన్ యూనియన్, వంద కోట్ల డోసులతో అమెరికా తర్వాతి స్థానాల్లో నిలిచాయంది. కెనడా, యూకే 35 కోట్ల డోసుల చొప్పున 7 కంపెనీల నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు డీల్స్ చేసుకున్నాయని తెలిపింది. సొంతంగా వ్యాక్సిన్ తయారు చేస్తున్నందున రష్యా, చైనాలను అనాలసిస్ లో చేర్చలేదని ప్రకటించింది.

మొదట 25 కోట్ల మందికి వ్యాక్సిన్

నవంబర్ నెలలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జులై, ఆగస్టు నాటికి 25 కోట్ల నుంచి 30 కోట్ల మందికి 40 కోట్ల నుంచి 50 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం అని అంచనా వేసినట్టు చెప్పారని అశోక యూనివర్సిటీలోని త్రివేది స్కూల్ ఆఫ్ బయోసైన్సెన్ డైరెక్టర్ షాహిద్ జమీల్ గుర్తు చేశారు. ఇండియన్ కంపెనీలు మ్యాను ఫ్యాక్చర్ చేసే ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రజెనికా, పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన నోవా వ్యాక్స్, హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ నుంచి వ్యాక్సిన్లను ముందస్తుగా బుక్ చేసుకున్నట్టు జమీల్ చెప్పారు. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా నుంచి ఏటా దాదాపు 40 కోట్ల డోసులు అదనంగా వస్తాయని ఆయన వివరించారు. 2021 నాటికి మొదటగా 50 కోట్ల డోసులను హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్, కరోనా సోకిన 65 ఏళ్లు పైబడిన వృద్ధులు..  ఇలా మొత్తం 25 కోట్ల  మందికి వ్యాక్సిన్ వేస్తారు. మిగతా వాళ్లకు తర్వాత ఏడాదుల్లో వ్యాక్సినేషన్ అందిస్తారని తెలిపారు. ప్రస్తుతం హెర్డ్ ఇమ్యూనిటీకి చేరుకోవడానికి ఎంత మందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న దానిపై ఇప్పటివరకు ప్రత్యేకంగా అంచనాలు ఏమీ లేదని ఇమ్యూనాలజిస్ట్ సత్యజిత్ రథ్  చెప్పారు. దాదాపు 80 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుందన్నారు. ఒక్కసారి వ్యాక్సిన్ ఇస్తే.. అది ఎప్పటి వరకు మనకు కాపాడుతుందనే దానిపై ఎలాటి
స్పష్టత లేదన్నారు.

ముందస్తు ఒప్పందాలు

తమ  ప్రజలను కరోనా నుంచి కాపాడాకునేందుకు అన్ని దేశాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని, వ్యాక్సిన్లు మార్కెట్ కు రిలీజ్ కాక ముందే కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయని రిపోర్ట్ తెలిపింది. ఇప్పటి వరకు 10 వ్యాక్సిన్లు ఫేజ్ 3 ట్రయల్స్ లో ఉన్నాయని, వీటిలో కొన్నింటినీ అత్యవసర సమయాల్లో వాడేందుకు అనుమతి కూడా లభించినట్టు పేర్కొంది. హై ఇన్ కమ్ ఉన్న దేశాలు 380 కోట్ల డోసులను, అప్పర్ మిడిల్ ఇన్ కమ్ కంట్రీస్ 82.9 కోట్ల డోసులను, లోయర్ మిడిల్ ఇన్ కమ్ దేశాలు 170 కోట్ల డోసులను కొనుగోలు చేస్తాయని పేర్కొంది.