
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తో పెద్ద ప్రమాదం తప్పింది. ఇవాళ శనివారం ఆయన హాట్ ఎయిర్ బెలూన్ కార్యకలాపాల కోసం మాండ్సౌర్ చేరుకున్నప్పుడు, ఆయన ఎక్కిన హాట్ ఎయిర్ బెలూన్ మంటల్లో చిక్కుకుంది. అయితే, ఆయనతో పాటు ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను హాట్ ఎయిర్ బెలూన్ నుండి బయటకు తీశారు.
సమాచారం ప్రకారం, మాండ్సౌర్‌లో గాంధీ సాగర్ అభయారణ్యం ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. శనివారం ఉదయం, ముఖ్యమంత్రి కూడా హాట్ ఎయిర్ బెలూన్ కార్యకలాపాల కోసం వచ్చారు. ఆయన బెలూన్ లోపల ఉన్నప్పుడు, హాట్ ఎయిర్ బెలూన్ కింద భాగంలో మంటలు చెలరేగాయి. దింతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను బయటకు తీసి మంటలను ఆర్పివేశారు.
ముఖ్యమంత్రి బెలూన్ ఎక్కినప్పుడు గాలి వేగం గంటకు 20 కిలోమీటర్లు ఉందని, అలాంటి పరిస్థితిలో బెలూన్ ముందుకు కదలలేకపోయిందని, దింతో కింది భాగంలో మంటలు చెలరేగాయని హాట్ ఎయిర్ బెలూన్ నిర్వహించేవారు వారు తెలిపారు.
నిజానికి, శుక్రవారం సాయంత్రం మాండ్‌సౌర్‌లోని గాంధీ సాగర్‌కు ఫారెస్ట్ రిట్రీట్ ఫెయిర్‌ను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వచ్చారు. శనివారం తెల్లవారుజామున ముఖ్యమంత్రి బోటింగ్ అలాగే క్రూయిజ్ ప్రయాణాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణించాలని అనుకున్నారు.
సీఎం మోహన్ యాదవ్ బెలూన్ బాక్స్ లోకి ఎక్కగానే బెలూన్ కింది కర్టెన్ వద్ద మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేసి ముఖ్యమంత్రిని సురక్షితంగా దింపారు. దీని తర్వాత కొద్దిసేపటికే సీయం హెలికాప్టర్ ద్వారా ఇండోర్ కు బయలుదేరారు.