
మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే. వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇక గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే భారీ చిత్రం 'విశ్వంభర' పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు చిత్రాల మధ్యలోనే చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా అధికారికంగా ప్రకటించి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
దసరా సెంటిమెంట్‌తో...
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన ఈ కొత్త చిత్రం గురించి అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. 'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన యువ దర్శకుడు బాబీ కొల్లి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇది సినిమాకు ఒక శుభారంభాన్ని ఇస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
'వాల్తేరు వీరయ్య'ను మించిన మాస్ ఫీస్ట్
'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవి మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టారు. ఇప్పుడు 'మెగా 158'లో అంతకు మించిన మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని, ఇది అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ గా అవుతుందని సినీ ఇండస్ట్రీలో టాక్ . చిత్ర నిర్మాతలు కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లోని బ్యాక్‌డ్రాప్, ఫస్ట్ లుక్ డిజైన్‌లు సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా, బాబీ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా చిరంజీవిని సరికొత్త మాస్ అవతార్‌లో చూపించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రిలీజ్ డేట్ అంచనాలు
ప్రస్తుతం చిరంజీవి చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. 'మన శంకర వరప్రసాద్' వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. ఆ తర్వాత 'విశ్వంభర' విడుదల కానుంది. ఇక ఈ 'మెగా 158' వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం బాబీ స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, చిరంజీవిలోని స్టైల్, ఎనర్జీ, మాస్ అప్పీల్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా కథ సిద్ధం చేశారని సమాచారం. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.