లడఖ్‌కు కొత్త రోడ్‌.. దళాల విస్తరణకు ఇండియా స్కెచ్?

లడఖ్‌కు కొత్త రోడ్‌.. దళాల విస్తరణకు ఇండియా స్కెచ్?

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో దాయాది పాకిస్తాన్‌తోపాటు కుటిల చైనా ఇండియాతో వైరానికి సిద్ధమవుతున్నాయి. దీంతో బార్డర్‌‌లో ప్రత్యర్థుల కంట పడకుండా దళాలను విస్తరించేందుకు ఇండియా కొత్త ప్లాన్‌ వేస్తోందని సమాచారం. మనాలీ నుంచి లేహ్‌కు కొత్త రోడ్‌ నిర్మించేందుకు సమాయత్తం అవుతోందని తెలిసింది. తద్వారా అత్యంత ఎత్తులో ఉన్న లడఖ్ పర్వతాల నుంచి మిగిలిన దేశానికి మూడో లింక్ ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎత్తుగడలో కీలకమైన సబ్ సెక్టార్ నార్త్‌తోపాటు దౌలత్ బేగ్ ఓల్డీకి మిగిలిన ప్రాంతాల నుంచి ప్రత్యామ్నాయ కనెక్టివీ కోసం అవసరమైన పనులను మూడేళ్ల నుంచి ఇండియా యత్నిస్తోంది. రీసెంట్‌గా ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో వాహనాలు నడిచే ఖర్దుంగ్ లా పాస్ రోడ్డులో ఈ పనులు మొదలయ్యాయి.

‘మనాలీ నుంచి లేహ్‌కు నిమూ–పదమ్–దార్చా యాక్సిస్ ప్రత్యామ్నాయ రూట్‌ పనులు జరుగుతున్నాయి. తద్వారా శ్రీనగర్‌‌లోని జోజిలా పాస్‌ లాంటి పాత రూట్లతో పోల్చుకుంటే కొత్త మార్గంతో చాలా సమయం ఆదా అవుతుంది’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త మార్గం ద్వారా పాకిస్తాన్‌కు తెలియకుండా మన ఆర్మీ దళాలు, ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, గన్స్‌ను లడఖ్‌లోని లొకేషన్స్‌కు పంపొచ్చని సదరు వర్గాలు పేర్కొన్నాయి.