రష్యా నుంచి భారీగా బొగ్గు కొనుగోలు

 రష్యా నుంచి భారీగా బొగ్గు కొనుగోలు
  • 30 శాతం వరకు డిస్కౌంట్​

న్యూఢిల్లీ: ఉక్రెయిన్​తో యుద్ధం వల్ల యూరప్​ దేశాల దిగుమతిదారులు రష్యా బొగ్గు కొనడం మానేయడం ఇండియన్​ కంపెనీలకు/కొనుగోలుదారులకు కలిసి వస్తోంది. మనదేశం ఇప్పుడు అక్కడి నుంచి భారీగా బొగ్గును కొంటున్నది. ఉక్రెయిన్‌‌‌‌పై దాడి చేసిన ఫలితంగా కఠినమైన ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా యూరప్​పై మండిపడుతోంది. తమ బొగ్గు కొనుగోలుపై ఆంక్షలు విధించడం వల్ల అది ఇతర మార్కెట్లకు వెళ్తోందని, ఇది అంతిమంగా యూరప్​ దేశాలకే నష్టం కలిగిస్తుందని స్పష్టం చేసింది.

ఇండియాకు  30శాతం వరకు తగ్గింపును అందిస్తున్నండటంతో ఇటీవలి వారాల్లో రష్యా బొగ్గు అమ్మకాలు పెరిగాయి. బొగ్గు  సంబంధిత వస్తువుల కొనుగోళ్లు ఈ ఏడాది జూన్ 15 నుండి 20 రోజులలో ఒక సంవత్సరం క్రితం ఇదే సమయంతో పోలిస్తే ఆరు రెట్లు పెరిగి 331.17 మిలియన్​ డాలర్లకు చేరుకున్నాయి. యూరప్​ దేశాలు తిరస్కరించిన చవక​ రష్యన్ క్రూడాయిల్​ను భారతీయ రిఫైనర్లు కొంటున్నారు. రష్యాతో భారత్ క్రూడాయిల్​ వాణిజ్యం విలువ గత బుధవారం వరకు 20 రోజుల్లో 31 రెట్లు పెరిగి 2.22 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 

కరెంటుకు విపరీతమైన డిమాండ్​

భారీ ఎండల వల్ల దక్షిణాసియాలో కరెంటుకు విపరీతంగా డిమాండ్​ పెరిగింది. ఇండియాలో చాలా చోట్ల కరెంటు కోతలను విధిస్తున్నారు.  దాదాపు ఆరేళ్లలో ఎన్నడూ లేనంత కరెంటు సంక్షోభం ఎదురయింది.  పారిశ్రామిక కార్యకలాపాలపై అన్ని కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయడంతో కరెంటు, సిమెంటు వాడకం మరింత పెరిగింది. దీంతో విదేశీ దిగుమతులను ఆపాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. మరో మూడేళ్లపాటు దిగుమతిని కొనసాగించాలని కంపెనీలను కోరింది. దిగుమతి చేసుకున్న అన్ని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌‌లలో ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించేందుకు అత్యవసర చట్టాన్ని కూడా అమలు చేసింది.

సరుకు రవాణా ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ భారతీయ వ్యాపారులు రష్యన్ బొగ్గును పెద్ద మొత్తంలో కొంటున్నారు.  రష్యన్ వ్యాపారులు కరెన్సీ విషయంలో ఉదారంగా ఉంటున్నారు.  భారతీయ రూపాయి, దిర్హామ్‌‌లలో చెల్లింపులను అంగీకరిస్తున్నారు. రాయిటర్స్ వార్తా సంస్థ  లెక్కల ప్రకారం, రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్​పై దాడి తర్వాత ఇండియా మూడు నెలల్లో కొనుగోలు చేసిన బొగ్గు విలువ 7.71 మిలియన్​ డాలర్ల కంటే ఎక్కువ. గత మూడు వారాల్లో భారతదేశం సగటున రోజుకు 16.55 మిలియన్​ డాలర్ల విలువైన రష్యన్ బొగ్గును కొనుగోలు చేసింది. ఇరవై రోజుల్లో   రోజుకు 110.86 మిలియన్​ డాలర్ల విలువైన క్రూడాయిల్​ను కొంటున్నదని రాయిటర్స్​ తెలిపింది.