న్యూఢిల్లీ: క్రూడాయిల్ ధరలు 90 డాలర్ల దగ్గర మరికొన్ని నెలల పాటు ఉన్నా, భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలదని ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అవెండస్ వెల్త్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే, చమురు ధరలు స్థిరంగా ఆ స్థాయిని దాటి పెరిగితే మాత్రం దేశ జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది.
భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు..
హార్మూజ్ జలసంధిపై ఆధారపడటం: భారతదేశం తన ముడి చమురు దిగుమతుల్లో 47శాతం, ఎల్‌పీజీలో 61శాతం, ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో 29శాతం వాటాను హార్మూజ్ జల సంధి మార్గం గుండానే పొందుతోంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఈ మార్గానికి అంతరాయం కలిగితే భారత్‌కు చమురు కొరత ఏర్పడుతుంది.
కరెంట్ అకౌంట్ లోటు: చమురు ధరలు ప్రతి 10 డాలర్లు పెరిగినప్పుడల్లా, భారతదేశ కరెంట్ అకౌంట్ లోటు దాదాపు 18 బిలియన్ డాలర్లు (రూ. 1.73 లక్షల కోట్లు) పెరుగుతుంది. ఇది దేశ జీడీపీలో 0.41 శాతానికి సమానం.
జీడీపీ వృద్ధిపై ప్రభావం: బ్రెంట్ క్రూడ్ ధర ప్రతి 10 డాలర్లు పెరిగితే, అది భారత జీడీపీ వృద్ధి రేటును 30 నుంచి 35 బేసిస్ పాయింట్ల (0.30శాతం -– 0.35శాతం) మేర దెబ్బతీస్తుంది. చమురు ధరలు ఎక్కువ కాలం పాటు గరిష్ట స్థాయిల్లో కొనసాగితే, రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించిన పరిమితిని దాటిపోయే ప్రమాదం ఉంది.
ప్లస్ పాయింట్స్..
అవెండస్ రిపోర్ట్ ప్రకారం, ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్‌గా ఉంది. దేశ బ్యాంకింగ్ సెక్టార్‌లో రూ. 5.1 లక్షల కోట్ల లిక్విడిటీ (మిగులు నిధులు) అందుబాటులో ఉండటం, 11 నెలల దిగుమతులకు సరిపడా ఫారెక్స్ ఉండటం కలిసొస్తుంది. కార్పొరేట్ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు కూడా బలంగా ఉన్నాయి.
