
- ఇండియా, చైనా టార్గెట్‌గా ట్రంప్ నిర్ణయం
- బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టేందుకు ఆమోదం
- ఇండియా ఆయిల్ దిగుమతుల్లో 40 % రష్యా నుంచే
- ఉక్రెయిన్‌పై రష్యా దాడులను సాకుగా చూపి టారిఫ్‌ల పెంపు
- అమెరికా బియ్యం కొనకుంటే 35% టారిఫ్ వేస్తామని జపాన్‌కు వార్నింగ్
న్యూఢిల్లీ: ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త బిల్లుతో వస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను సాకుగా చూపి, రష్యా నుంచి ఆయిల్కొనే దేశాలపై 500 శాతం టారిఫ్ వేస్తామని హెచ్చరించారు. ఇండియా క్రూడాయిల్ దిగుమతుల్లో సుమారు 40 శాతం రష్యా నుంచి వస్తోంది. ‘‘రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లు దాటినప్పటికీ, రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దాడులు కొనసాగిస్తున్నారు. ఈ "క్రూర యుద్ధం" కోసం అతన్ని శిక్షించేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు”అని యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఏబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ న్యూస్ ప్రకారం, ట్రంప్ రష్యాతో వ్యాపారం చేస్తున్న చైనా, భారత్ లాంటి దేశాలపై 500శాతం టారిఫ్‌లు విధించే సెనేట్ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లులో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలను "యుద్ధానికి సపోర్టర్లు"గా పేర్కొన్నారు. ట్రంప్ ఈ కఠిన ఆంక్షల బిల్లును ఓటింగ్‌కు తీసుకొచ్చేందుకు అంగీకరించారని లిండ్సే చెప్పారు. ‘‘ఈ బిల్ ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వని, రష్యా ఉత్పత్తులు కొనే దేశాలపై 500శాతం టారిఫ్‌లు విధిస్తుంది. ముఖ్యంగా భారత్, చైనాలను టార్గెట్ చేస్తుంది. 84 మంది సెనేటర్లు ఈ బిల్‌కు మద్దతు ఇస్తున్నారు. ట్రంప్‌కు ఈ ఆంక్షలను వాయిదా వేసే లేదా బిల్‌ను వీటో చేసే అధికారం ఉంది”అని స్పష్టం చేశారు. దీనిని ఆర్థిక "బంకర్ బస్టర్"గా అభివర్ణించారు.
భారత్‌పై ప్రభావం..
ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ముందు భారత్ రష్యాతో పెద్దగా ఆయిల్ వ్యాపారం చేయలేదు. సాధారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి కొనేది. కానీ, ఈ యుద్ధం తర్వాత వెస్ట్రన్ దేశాలు మాస్కోపై ఆంక్షలు పెట్టాయి. పుతిన్ భారీ డిస్కౌంట్లు ఇవ్వడంతో భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనడం పెంచింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ డేటా ప్రకారం, ఈ ఏడాది మే లో భారత్ రష్యా నుంచి 4.2 బిలియన్ పౌండ్ల (రూ.42 వేల కోట్ల) విలువైన ఫాసిల్ ఇంధనాలు (బొగ్గు, క్రూడాయిల్ వంటివి) కొనుగోలు చేసింది. ఇందులో 72శాతం వాటా క్రూడ్ ఆయిల్‌దే. రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని యూఎస్, యూరప్ విమర్శించగా, భారత్ మాత్రం తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది. 500శాతం టారిఫ్ వస్తే, భారత్ మళ్లీ మిడిల్ ఈస్ట్ దేశాల వైపు మొగ్గు చూపొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. కానీ, రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు పూర్తిగా తగ్గిపోవని అన్నారు.
యూరప్ కొంటే నో ప్రాబ్లమ్
తాజా బిల్లులో ఐరోపా రష్యాతో చేసే గ్యాస్ వ్యాపారాన్ని ప్రస్తావించలేదు. ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ, యూరప్ రష్యా నుంచి పెద్ద మొత్తంలో గ్యాస్ కొనుగోలు చేస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 2022 జూన్ 3న గ్లోబ్సెక్ –2022 బ్రాటిస్లావా ఫోరమ్‌లో ఈ విషయాన్ని ఎత్తిచూపారు. ఐరోపా రష్యన్ గ్యాస్ కొనడం యుద్ధానికి ఫండింగ్ కాదా ? అని ప్రశ్నించారు. ఇరాన్, వెనిజులా ఆయిల్‌పై ఆంక్షలు ఎత్తివేయకపోవడాన్ని కూడా విమర్శించారు. యూఎస్ సెనేటర్ లిండ్సే వ్యాఖ్యలపై సోమవారం రష్యా ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ స్పందించారు. ఈ బిల్లు అమలైతే ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు ప్రభావితం అవుతాయని హెచ్చరించారు. లిండ్సే రష్యాకు బయపడుతున్నాడని, లేకపోతే ఆంక్షలు ఇప్పటికే విధించేవారని పేర్కొన్నారు.
జపాన్‌పై 35 శాతం టారిఫ్ వేస్తాం
అమెరికన్ బియ్యం కొనకపోతే 30–-35శాతం టారిఫ్‌లు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ జపాన్ను బెదిరించారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో జర్నలిస్టులతో మాట్లాడుతూ, జపాన్‌తో ఆటోమోటివ్ సెగ్మెంట్లో నెలకొన్న ట్రేడ్ డెఫిసిట్(వ్యాపార లోటు), యూఎస్ బియ్యం దిగుమతులపై ఈ దేశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. "జపాన్‌తో ఒప్పందం కుదురుతుందని అనుకోను. వాళ్లు చాలా కఠినంగా ఉన్నారు. మేము వాళ్లకు లేఖ రాస్తాం, 'మీరు మాకు కావలసినవి చేయలేరు, కాబట్టి 30–-35శాతం టారిఫ్ చెల్లించాలి' అని చెప్తాం. జపాన్‌తో మాకు భారీ వాణిజ్య లోటు ఉంది" అని ట్రంప్ అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రంప్ చాలా దేశాలపై 10శాతం బేస్ టారిఫ్ విధించారు. చర్చలకు వచ్చే కొన్ని దేశాలపై విధించిన ఎక్కువ రేట్లను సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ జులై 9తో ముగుస్తుంది.