
- ఆర్థిక వ్యవస్థ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర
- మెరుగుపడుతున్న దౌత్య సంబంధాలు
- ఈ ఏడాది చివర్లో ఇండియాకు పుతిన్
- ఎస్సీవో సదస్సుకు హాజరయ్యేందుకు చైనాకు మోదీ
- లోకల్ కరెన్సీలో లావాదేవీలతో తగ్గనున్న డాలర్ విలువ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ భేటీ అయినా, జెలెస్కీతో ట్రంప్ సమావేశమై చర్చలు జరిపినా.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఒకవైపు చర్చలు కొనసాగుతుండగానే.. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం కురిపిస్తున్నది. దీనికితోడు ట్రంప్ విధించిన టారిఫ్‌లు ప్రపంచ దేశాలను ఆర్థిక అనిశ్చితివైపు తీసుకెళ్తున్నాయి. దీంతో ఇండియా, రష్యా, చైనా కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపర్చుకుంటూ.. ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఈ ఏడాది చివరి నాటికి ఇండియాలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుమారు ఏడేండ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టనున్నారు. ఆగస్టు చివర్లో నిర్వహించనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) సదస్సుకు హాజరుకానున్నారు. పుతిన్, మోదీ పర్యటనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని పలువురు అభిప్రాయపడ్తున్నారు. డ్రాగన్, బియర్, టైగర్ కలిసి వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్ అని అంటున్నారు.
టారిఫ్‌లు ప్రభావం చూపవంటున్న ఎక్స్పర్ట్స్
ఆయా దేశాలపై ట్రంప్ వేసిన టారిఫ్‌లు.. ప్రస్తుత ప్రపంచ వాణిజ్య సరుకుల వ్యాపారంపై పెద్దగా ప్రభావం చూపవని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇప్పుడు తాము యూనిపోలార్ ఎకానమీలో లేమని, అందుకే టారిఫ్‌ల ప్రభావం అంతగా ఉండదని చెప్తున్నారు. దాదాపు చాలా దేశాలు తమ పొలిటికల్ ఈగోస్‌ను పక్కనపెట్టి.. వ్యాపార సంబంధాలపై దృష్టి పెట్టాయని తెలిపారు. ఇండియా, రష్యా, చైనా కలిసి ముందుకెళ్లడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్‌పైనే ఎక్కువ ఆధారపడటం కూడా ఈ మూడు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహ సంబంధాలకు ఓ కారణమని నిపుణులు అంటున్నారు.
‘‘ఒక్కో దేశం యూనిక్ స్ర్టెంత్‌ను కలిగి ఉన్నాయి. చైనా మ్యానుఫాక్చరింగ్ డామినెన్స్, రష్యా ఎనర్జీ సెక్టార్లో సుప్రీం, ఇండియా సర్వీస్ ఎకానమీ, బలమైన మార్కెట్ వ్యవస్థలు కలిగి ఉన్నాయి. ఈ మూడు దేశాల మధ్య జరిగే వ్యాపారం.. దేశీయ కరెన్సీలో లావాదేవీలు.. ఆర్థిక వ్యవస్థలను మరింత మెరుగుపరుస్తాయి. దీంతో యూఎస్ డాలర్‌పై ఆధారపడటం తగ్గుతది’’అని సీఐఐఏ అండ్ వ్యాల్యూమ్ క్యాపిటల్ ఫౌండర్ మనీశ్ భండారీ తెలిపారు.
మూడింట ఒక వంతు ఎకానమీ.. ఈ మూడు దేశాలదే
ఇండియా, రష్యా, చైనా 53.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఎకానమీలో మూడింట ఒకవంతు ఈ మూడు దేశాలే ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. ఇక ఎగుమతుల్లో కూడా పెద్ద వాటానే కలిగి ఉన్నాయి. సుమారు 5.09 ట్రిలియన్ డాలర్లు సరుకులను ఎక్స్‌పోర్టు చేస్తున్నాయి. ప్రపంచ దేశాల ఎగుమతుల్లో ఇది ఐదో వంతు. ప్రపంచ వ్యాణిజ్యానికి వెన్నుముకగా నిలుస్తున్నాయి. ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఇండస్ట్రీ సెక్టార్లను కనెక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం చాలా దేశాలు డాలర్‌పై ఆధారపడుతున్నాయి.
అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ఇండియా, చైనా లోకల్ కరెన్సీలో క్రూడాయిల్ కొనుగోలు చేస్తున్నాయి. మూడు దేశాలు తమ సైనిక శక్తిని కూడా బలోపేతం చేసుకుంటున్నాయి. 549 బిలియన్ డాలర్లు కేటాయించాయి. వరల్డ్ డిఫెన్స్ బడ్జెట్లో 20.2 శాతంగా ఉంది. ఇండియా ఇప్పటికే రష్యాతో మంచి సంబంధాలు కలిగి ఉన్నది. దీనికితోడు చైనా కూడా స్నేహం కోసం ఇండియా వైపు అడుగులు వేస్తున్నది. ఇదే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది అని పలువురు ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.