హైస్పీడ్ విక్టరీ.. సెమీస్‌ దారిలో సోమవారం మ్యాచ్‌ కీలకం

హైస్పీడ్ విక్టరీ.. సెమీస్‌ దారిలో సోమవారం మ్యాచ్‌ కీలకం
  • 39 బాల్స్​లోనే.. టార్గెట్ ఛేజ్ చేసిన టీంఇండియా
  • స్కాట్లాండ్‌పై 8 వికెట్లతో విక్టరీ
  • చెలరేగిన రాహుల్‌, జడేజా, షమీ
  • రన్‌రేట్‌ పెంచుకొని థర్డ్‌ ప్లేస్‌కు కోహ్లీసేన

దుబాయ్‌‌‌‌: సమ ఉజ్జీలతో పోటీలో నిరాశ పరిచిన టీమిం డియా.. టీ20 వరల్డ్​కప్​లో చిన్న జట్లపై విరుచుకుపడుతోంది. గత పోరులో అఫ్గానిస్తాన్‌‌ను చిత్తు చేసిన కోహ్లీసేన తాజాగా స్కాట్లాండ్‌‌పై పంజా విసిరింది. బౌలింగ్‌‌లో రవీంద్ర జడేజా (3/15), మహ్మద్‌‌ షమీ (3/15), బ్యాటింగ్‌‌లో లోకేశ్‌‌ రాహుల్‌‌ (19 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50), రోహిత్‌‌ శర్మ (16 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 30) చెలరేగిన వేళ శుక్రవారం జరిగిన గ్రూప్‌‌–2 పోరులో  8 వికెట్ల తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌‌ 24.1 ఓవర్లోనే ముగించింది. తొలుత జడేజా, షమీతో పాటు  బుమ్రా (2/10) దెబ్బకు స్కాట్లాండ్‌‌ 17.4 ఓవర్లలో 85 రన్స్‌‌కే ఆలౌటైంది. ఓపెనర్‌‌ జార్జ్‌‌ మున్సే (24), మిచెల్‌‌ లీస్క్‌‌ (21) టాప్‌‌ స్కోరర్లు. అనంతరం రాహుల్‌‌, రోహిత్‌‌ మెరుపులతో  కోహ్లీసేన 2 వికెట్లు కోల్పోయి 39 బాల్స్​లోనే (6.3 ఓవర్లలో) టార్గెట్‌‌ ఛేజ్ చేసింది.  81 బాల్స్‌‌ మిగిలుండగానే గెలిచింది. మిగిలున్న బాల్స్​ పరంగా టీ20ల్లో ఇండియాకు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. జడేజా ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​గా నిలిచాడు. తన బర్త్‌‌డే రోజు కోహ్లీ టోర్నీలో తొలిసారి టాస్‌‌ నెగ్గడంతో పాటు ఫస్ట్‌‌ టైమ్‌‌ ఛేజింగ్‌‌ చేసిన ఇండియా రెండు  భారీ విక్టరీతో పాటు నెట్‌‌ రన్‌‌రేట్‌‌ (1.619)ను అమాంతం పెంచుకుంది. 4 పాయింట్లతో మూడో ప్లేస్‌‌కు దూసుకెళ్లింది. ఈ గ్రూప్‌‌లో కోహ్లీసేనదే  బెస్ట్‌‌ రన్‌‌రేట్‌‌ కావడం విశేషం. ఇక, ఆదివారం జరిగే మ్యాచ్‌‌లో  న్యూజిలాండ్‌‌ (1.277)ను  అఫ్గాన్​(1.481)  ఓడించి.. సోమవారం జరిగే  తమ చివరి మ్యాచ్‌‌లో నమీబియాపై భారీ విక్టరీ సాధిస్తే ఇండియాను సెమీస్​లో చూడొచ్చు.

రాహుల్​, రోహిత్​ ధనాధన్​

అఫ్గానిస్తాన్‌‌ రన్‌‌రేట్‌‌ దాటాలంటే 7.1 ఓవర్లలో (43 బాల్స్‌‌) ఇండియా గెలవాల్సిన అవసరం ఉండగా.. ఓపెనర్లు లోకేశ్‌‌ రాహుల్‌‌, రోహిత్‌‌ మెరుపులతో 6.3 ఓవర్లలోనే (39 బాల్స్‌‌) టార్గెట్‌‌ కంప్లీట్​అయింది. వీల్‌‌ వేసిన రెండో ఓవర్లో రాహుల్‌‌ మూడు ఫోర్లతో జోరు చూపాడు. థర్డ్‌‌ ఓవర్లో తను 4,6 కొట్టగా.. నాలుగో ఓవర్లో హిట్‌‌మ్యాన్‌‌ 6,4,4 బాదాడు. దాంతో, ఈ ఫార్మాట్‌‌లో ఇండియా ఫాస్టెస్ట్‌‌ ఫిఫ్టీ 23 బాల్స్‌‌లోనే చేసింది. వీల్‌‌ వేసిన రాహుల్‌‌ 4,6 రాబట్టగా.. ఓ ఫోర్‌‌ కొట్టిన రోహిత్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు ఎల్బీ అయ్యాడు. అయినా వెనక్కుతగ్గని రాహుల్‌‌ ఆరో ఓవర్లో 4,6 రాబట్టి 18 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకున్నాడు. లాస్ట్‌‌ బాల్‌‌కు సిక్సర్‌‌తో పవర్‌‌ప్లేలోనే  మ్యాచ్‌‌ను ముగించాలని చూశాడు. కానీ, భారీ షాట్‌‌కు ట్రై చేసి మిడాన్‌‌లో మెక్‌‌లియోడ్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. తర్వాతి ఓవర్‌‌ మూడో బాల్‌‌కు సిక్సర్‌‌ బాదిన సూర్యకుమార్‌‌ (6 నాటౌట్‌‌) మ్యాచ్‌‌ ఫినిష్‌‌ చేశాడు.

జడ్డూ, షమీ తడాఖా

తొలుత టాస్‌‌ నెగ్గిన కెప్టెన్‌‌ కోహ్లీ బౌలింగ్‌‌ ఎంచుకోగా.. అతని నిర్ణయానికి బౌలర్లు పూర్తి న్యాయం చేశారు. బుమ్రా తొలి దెబ్బ కొట్టగా..   జడేజా, షమీ పోటీ పడి వికెట్లు తీసి స్కాట్లాండ్‌‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేశారు. బుమ్రా వేసిన ఫస్ట్ ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు సిక్స్‌‌ కొట్టిన ఓపెనర్​ జార్జ్‌‌ ముస్నే  ఆశ్చర్యపరిచాడు. మరో ఓపెనర్‌‌ కొయెట్జర్‌‌ను (1) మూడో ఓవర్లో క్లీన్‌‌బౌల్డ్‌‌ చేసిన బుమ్రా ఫస్ట్‌‌ బ్రేక్‌‌ ఇచ్చాడు. వెనక్కుతగ్గని జార్జ్‌‌.. అశ్విన్‌‌కు హ్యాట్రిక్‌‌ ఫోర్లతో స్వాగతం పలికాడు. లాభం లేదని షమీ, జడేజాను కోహ్లీ బరిలోకి దింపాడు. ఆరో ఓవర్లో షమీ.. జార్జ్‌‌ను ఔట్‌‌ చేయగా.. తర్వాతి ఓవర్లో బెరింగ్టన్‌‌ (0), మాథ్యూ క్రాస్‌‌ (2)ను  జడ్డూ వెనక్కుపంపాడు.  ఈ దశలో మెక్‌‌లియోడ్‌‌ (16),  లీస్క్‌‌ కాసేపు ప్రతిఘటించారు. షమీ వేసిన 11వ ఓవర్లో లీస్క్‌‌ 6,4తో జోరు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే అతడిని జడేజా ఎల్బీ చేశాడు. కొద్దిసేపటికే గ్రేవ్స్‌‌ (1)ను అశ్విన్‌‌ ఔట్​ చేయగా.. 17వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌‌కు షమీ.. మెక్‌‌లియోడ్, ఎవాన్స్‌‌ (0)ను క్లీన్‌‌బౌల్డ్‌‌ చేశాడు.  మధ్యలో సఫ్యాన్‌‌ షరిఫ్‌‌ (0) రనౌటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే మార్క్‌‌ వాట్‌‌ (14)ను బుమ్రా లాస్ట్​ వికెట్​గా ఔట్​ చేశాడు.

సంక్షిప్త స్కోర్లు

స్కాట్లాండ్‌‌:  17.4 ఓవర్లో 85 ఆలౌట్‌‌ ( మున్సే 24, షమీ 3/15,  జడేజా 3/15)

ఇండియా: 6.3 ఓవర్లలో 89/2 (రాహుల్‌‌ 50, రోహిత్‌‌ 30, మార్క్​ వాట్​ 1/20)