రేపు డిఫెన్స్ మాక్ డ్రిల్స్ .. అన్ని రాష్ట్రాల్లో నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు

రేపు డిఫెన్స్ మాక్ డ్రిల్స్ .. అన్ని రాష్ట్రాల్లో నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు
  • 1971 తర్వాత మళ్లీ ఇప్పుడే నిర్వహణ

న్యూఢిల్లీ: పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే విషయంపై పౌరులకు అవగాహన కల్పించాలని  హోంశాఖ తెలిపింది. దేశ భద్రతలో పౌరులను సిద్ధం చేయాలని కోరింది. పహల్గాం దాడికి పాల్పడిన టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు ఇప్పటికే వేట ప్రారంభించగా.. టెర్రరిజాన్ని, టెర్రరిస్టులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం నేర్పించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. టెర్రర్ స్థావరాలను ఏరివేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా త్రివిధ దళాలను అప్రమత్తం చేసింది. 

పాక్​ పై ప్రతీకార దాడుల అంచనాల నేపథ్యంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. మాక్ డ్రిల్స్ ద్వారా శత్రువుల నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టిసారించినట్లు తెలుస్తున్నది.   డ్రిల్స్‌‌లో  భాగంగా.. ఎయిర్  రైడ్ వార్నింగ్ సైరన్ల ఆపరేషన్, పౌరులు, విద్యార్థులకు సివిల్ డిఫెన్స్ శిక్షణ, కీలక స్థాపనల కామోఫ్లాజ్, క్రాష్ బ్లాకౌట్ చర్యలు, ఖాళీ చేయడం(ఎవాక్యుయేషన్) ప్రణాళికల అప్‌‌డేట్, రిహార్సల్ వంటివి నిర్వహించనున్నారు. 

భారత్, పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధ సమయంలో ప్రభుత్వం ఇదేవిధంగా సివిల్​ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే జాతీయ స్థాయిలో డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. యుద్ధ వాతావరణంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ల మధ్య సమన్వయం, ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ఈ డ్రిల్స్ లక్ష్యం. డ్రిల్స్ కేవలం సన్నద్ధత కోసమేనని, ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదని అధికారులు  స్పష్టం చేశారు.