మీ ఉపన్యాసాలు మాకొద్దు: ఇండియా

మీ ఉపన్యాసాలు మాకొద్దు: ఇండియా

న్యూఢిల్లీ: సీఏఏపై అమెరికా చేసిన కామెంట్లకు మన దేశం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.  ‘మీ ఉపన్యాసాలు మాకు అక్కర్లేదు’ అంటూ మండిపడింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సీఏఏపై అమెరికా చేసిన వ్యాఖ్యలు తప్పు అని, అవి అనవసరమైనవని ఫైర్ అయ్యారు. ‘‘సిటిజన్ షిప్ ఇచ్చేందుకు తీసుకొచ్చిందే కానీ లాక్కోవడానికి కాదు. తనకంటూ ఒక దేశంలేని వ్యక్తి సమస్యను ఈ చట్టం పరిష్కరిస్తుంది. 

మానవ హక్కులకు మద్దతు ఇస్తుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్​లో హింసకు గురై 2014  డిసెంబర్ 31 కంటే ముందు భారత్​కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైన్, పార్సీ, క్రిస్టియన్లకు పౌరసత్వం కల్పిస్తుంది. కాబట్టి సీఏఏను మా దేశ భాగస్వాములు, శ్రేయోభిలాషులు స్వాగతించాలి” అని కోరారు. ‘‘ఇది మా దేశ అంతర్గత వ్యవహారం. భారత బహుళ సంప్రదాయాలు, విభజన అనంతర చరిత్రపై సరైన అవగాహన లేనివారు మాకు ఉపన్యాసాలు ఇవ్వొద్దు” అని అమెరికాకు కౌంటర్ ఇచ్చారు.