 
                                    - 339 రన్స్‌ను ఊదేశారు..
- విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లోకి ఇండియా
- సెమీస్‌లో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గ్రాండ్ విక్టరీ
- జెమీమా, హర్మన్‌ప్రీత్ సూపర్ షో
- లిచ్‌ఫీల్డ్ సెంచరీ వృథా
నవీ ముంబై: విమెన్స్ వన్డే క్రికెట్‌లో ఇండియా చరిత్ర సృష్టించింది. గతంలో ఏ జట్టుకూ సాధ్యంకాని భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది. జెమీమా రొడ్రిగ్స్ (134 బాల్స్‌లో 14 ఫోర్లతో 127 నాటౌట్) సూపర్ సెంచరీకి తోడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 89) దుమ్మురేపడంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 రన్స్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో కంగారూలపై గెలిచి మూడోసారి గ్రాండ్‌గా ఫైనల్లోకి అడుగుపెట్టింది. 2005, 2017లో ఇండియా టైటిల్ ఫైట్‌కు చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
టాస్ గెలిచిన ఆసీస్ 49.5 ఓవర్లలో 338 రన్స్‌కు ఆలౌటైంది. ఫోబీ లిచ్‌ఫీల్డ్ (93 బాల్స్‌లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 119), ఎలైస్ పెర్రీ (88 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77), ఆష్లే గార్డెనర్ (45 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) దంచికొట్టారు. తర్వాత ఇండియా 48.3 ఓవర్లలోనే 341/5 స్కోరు చేసింది. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఇండియా... సౌతాఫ్రికాతో తలపడుతుంది.
కీలక భాగస్వామ్యాలు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు తేలిపోయారు. దీంతో లిచ్‌ఫీల్డ్, పెర్రీ, గార్డెనర్ మూడు కీలక భాగస్వామ్యాలతో భారీ స్కోరు అందించారు. ఆరో ఓవర్‌లో కెప్టెన్ అలీసా హీలీ (5)ని ఔట్ చేసి క్రాంతి గౌడ్ (1/58) శుభారంభాన్ని మిగతా బౌలర్లు అందుకోలేకపోయారు. దీంతో లిచ్‌ఫీల్డ్, పెర్రీ అద్భుతంగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. పేస్–స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడీ ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగారు. ఫలితంగా 77 బాల్స్‌లోనే సెంచరీ చేసిన లిచ్‌ఫీల్డ్ రెండో వికెట్‌కు 155 రన్స్ జోడించి వెనుదిరిగింది.
ఈ దశలో వచ్చిన బెత్ మూనీ (24) ఉన్నంతసేపు వేగంగా ఆడింది. కానీ శ్రీ చరణి (2/49) వరుస ఓవర్లలో మూనీ, సదర్లాండ్ (3)ని ఔట్ చేసింది. మూడో వికెట్‌కు 40 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. కొత్తగా క్రీజులోకి వచ్చిన గార్డ్‌నర్ బ్యాట్ ఝుళిపించగా, అప్పటికే హాఫ్ సెంచరీ చేసిన పెర్రీ 40వ ఓవర్‌లో అనూహ్యంగా రనౌటైంది. దాంతో ఆసీస్ 243/5తో నిలిచింది. ఈ దశలో ఇండియా బౌలర్లు, ఫీల్డర్లు మెరిసినా గార్డ్‌నర్ బ్యాటింగ్ జోరును ఆపలేకపోయారు. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో రెచ్చిపోయిన గార్డ్‌నర్ 41 బాల్స్‌లోనే ఫిఫ్టీ కొట్టింది.
తహ్లియా మెక్‌గ్రాత్ (12) రనౌటైనా.. కిమ్ గార్త్ (17)తో ఏడో వికెట్‌కు 66 రన్స్ జత చేసి గార్డ్‌నర్ కూడా రనౌటైంది. అప్పటికే ఆసీస్ స్కోరు 331కి చేరింది. చివర్లో అలానా కింగ్ (4), సోఫీ మొనులిక్స్ (0) నిరాశపర్చినా కంగారూలు భారీ టార్గెట్‌ను నిర్దేశించారు.
జెమీమా, కౌర్ అదుర్స్..
భారీ ఛేజింగ్‌లో ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. రెండో ఓవర్‌లోనే షెఫాలీ వర్మ (10)ని గార్త్ (2/46) ఔట్ చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన (24)తో కలిసి ఇన్నింగ్స్‌ను గట్టెక్కించే బాధ్యత తీసుకున్న జెమీమా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కుదురుకునేందుకు టైమ్ తీసుకున్నా చివరి వరకు క్రీజులో నిలిచి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. అయితే 10వ ఓవర్‌లో మంధానా ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 46 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గత మ్యాచ్‌లకు భిన్నంగా ఆడింది.
ఓ ఎండ్‌లో జెమీమాను ఆడిస్తూనే తానూ లాంగాన్, లాంగాఫ్‌లో బౌండ్రీల వర్షం కురిపించింది. దాదాపు 25 ఓవర్లు వీళ్లిద్దరు ఆసీస్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నారు. ఈ జోడీని విడదీసేందుకు కంగారూలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో జెమీమా 57, హర్మన్ 65 బాల్స్‌లో హాఫ్ సెంచరీలు చేశారు. ఈ ఇద్దరి జోరుతో ఇండియా 32వ ఓవర్‌లో 200 స్కోరు చేసింది.
అయితే సెంచరీ దిశగా సాగుతున్న కౌర్‌ను 36వ ఓవర్‌లో సదర్లాండ్ (2/69) ఔట్ చేసింది. ఫలితంగా మూడో వికెట్‌కు 167 రన్స్ జతయ్యాయి. ఓ ఎండ్‌లో 115 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేసిన జెమీమా క్రీజులో పాతుకుపోగా, రెండో ఎండ్‌లో దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26) ధనాధన్ షాట్లతో రెచ్చిపోయారు. 65 బాల్స్‌లో 84 రన్స్ జోడించి వెనుదిరిగారు. ఇక చివర్లో ఉత్కంఠ మొదలైనా జెమీమా, అమన్‌జోత్ కౌర్ (15 నాటౌట్) బౌండ్రీలతో ఒత్తిడి తగ్గించుకుని ఈజీగా విజయాన్ని అందించారు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 49.5 ఓవర్లలో 338 ఆలౌట్ (లిచ్‌ఫీల్డ్ 119, పెర్రీ 77, గార్డ్‌నర్ 63, శ్రీ చరణి 2/49, దీప్తి శర్మ 2/73). ఇండియా: 48.3 ఓవర్లలో 341/5 (జెమీమా 127*, హర్మన్ 89, గార్త్ 2/46).

 
         
                     
                     
                    