కోల్‌కతా: వరల్డ్ టెస్ట్ చాంపియన్ సౌతాఫ్రికాతో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో తొలి రోజు ఇండియా ఆధిపత్యమే నడిచింది. అద్భుతమైన స్వింగ్, సీమ్, కంట్రోల్‌తో కూడిన బౌలింగ్‌తో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (5/27) సఫారీ ఇన్నింగ్స్‌ను శాసించాడు. ఫలితంగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 159 రన్స్‌కే కుప్పకూలింది. ఐడెన్ మార్‌క్రమ్ (31) టాప్ స్కోరర్. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 37/1 స్కోరు చేసింది.
కేఎల్ రాహుల్ (13 బ్యాటింగ్), వాషింగ్టన్ సుందర్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో మార్కో యాన్సెన్ (1/11) శరీరానికి దగ్గరగా వేసిన బాల్‌ను ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) వికెట్ల మీదకు ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వెలుతురు తగ్గడంతో సఫారీ టీమ్ క్లోజ్ ఫీల్డింగ్‌తో ఒత్తిడి పెంచినా రాహుల్, సుందర్ జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు. ప్రస్తుతం ప్రత్యర్థి స్కోరుకు ఇండియా 122 రన్స్ దూరంలో ఉంది.
రెండు సెషన్లలోనే..
2012 తర్వాత ఇండియా ఈ మ్యాచ్‌లో తొలిసారి నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. స్పిన్ దాడితో సఫారీలను పడగొట్టాలని భావించింది. కానీ, బుమ్రా తన అసమాన పేస్ బౌలింగ్‌తో విజృంభించడంతో స్పిన్నర్ల అవసరం అంతగా లేకుండా పోయింది. రెండు సెషన్లలోనూ సఫారీ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి 16వ సారి (96 ఇన్నింగ్స్) ఐదు వికెట్ల హాల్ సాధించాడు. దాంతో ప్రొటీస్ ఇన్నింగ్స్ 4 గంటల 13 నిమిషాల్లోనే ముగిసింది.
ఓపెనర్లు మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్ (23) తొలి 10 ఓవర్లలో 57/0 స్కోరు చేసి శుభారంభాన్నిచ్చారు. కానీ తదుపరి 45 ఓవర్లలో కేవలం 102 రన్స్ మాత్రమే జోడించిన సౌతాఫ్రికా 10 వికెట్లు కోల్పోయింది. సఫారీలు టెస్ట్‌ల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫిఫ్టీకి పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం లభించిన తర్వాత చేసిన రెండో అత్యల్ప స్కోరు (152) ఇది. 2018 కేప్ టౌన్ ఇండియాతో జరిగిన టెస్ట్‌లోనూ సెకండ్ ఇన్నింగ్స్‌లో 130 రన్స్‌కే ఆలౌటైంది.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ మార్‌క్రమ్ 23 డాట్ బాల్స్ తర్వాత స్ట్రెయిట్ డ్రైవ్‌తో ఫోర్ కొట్టాడు. ఆ వెంటనే అక్షర్ పటేల్‌ను లక్ష్యంగా చేసుకుని రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టాడు. రెండో ఎండ్‌లో కుదురుకున్న రికెల్టన్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. ఈ టైమ్‌లో ఓవర్‌కు ఐదుకి పైగా రన్ రేట్ రావడంతో ఇండియా బౌలర్లు కాస్త నిరాశకు లోనయ్యారు.
కానీ సెషన్ డ్రింక్స్ బ్రేక్‌కు ముందు క్లబ్ హౌస్ ఎండ్ నుంచి బౌలింగ్ చేసిన బుమ్రా ఐదు బాల్స్ తేడాలో రికెల్టన్, మార్‌క్రమ్‌ను ఔట్ చేసి సఫారీలను దెబ్బకొట్టాడు. కొద్దిసేపటికే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (2/36).. కెప్టెన్ టెంబా బవూమ (3)ను ఔట్ చేయడంతో సౌతాఫ్రికా 105/3తో లంచ్‌కు వెళ్లింది.
రివర్స్ స్వింగ్‌తో దెబ్బ..
లంచ్ నుంచి వచ్చిన వెంటనే కుల్దీప్.. వియాన్ ముల్డర్ (24)ను పెవిలియన్‌కు పంపాడు. దాంతో నాలుగో వికెట్‌కు 43 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇక తొలి సెషన్‌లో ఆరు ఓవర్లలో 34 రన్స్ ఇచ్చిన సిరాజ్ (2/47) రెండో సెషన్‌లో గాడిలో పడ్డాడు. తన 10వ ఓవర్లో వెరెన్ (16), మార్కో యాన్సెన్ (0)ను ఔట్ చేశాడు.
అప్పటివరకు ఓ ఎండ్‌లో పాతుకుపోయిన డి జార్జి (24)ని రివర్స్ స్వింగ్‌తో దెబ్బకొట్టిన బుమ్రా ప్రొటీస్ టెయిలెండర్ల పని పట్టాడు. మధ్యలో అక్షర్ పటేల్ (1/21).. కార్బిన్ బాష్ (3) వెనక్కి పంపిన కొద్దిసేపటికే బుమ్రా.. నాలుగు బాల్స్ తేడాలో హార్మర్ (5), కేశవ్ మహారాజ్ (0)ను ఔట్ చేసి సఫారీ ఇన్నింగ్స్‌ను ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 55 ఓవర్లలో 159 ఆలౌట్ (మార్‌క్రమ్ 31, ముల్డర్ 24, బుమ్రా 5/27, కుల్దీప్ 2/36).
ఇండియా తొలి ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 37/1 (రాహుల్ 13 బ్యాటింగ్, సుందర్ 6 బ్యాటింగ్,
యాన్సెన్ 1/11).
